కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-24T04:31:16+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ కామెంట్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ కామెంట్స్

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శలు చేశారు. పెట్రోల్ ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా ఉంటుందని ఆమె విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుతున్న భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల్లో అడ్డగోలుగా పెట్రోల్ రేటును పెంచుతున్నారని ఆమె మండిపడ్డారు.


పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆమె అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రo 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటును రూ. 10 వరకు పెంచారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంటి ఖజానా నిండితే చాలు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు.


మన రాష్ట్రంలోనే చమురు నిక్షేపాలు ఉన్న మనకు ఎటువంటి ఉపయోగం లేదని, రిలయన్స్ లాంటి సంస్థలకు ఆ సంపదను అప్పగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నాయని, ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి ఈ సమస్యల మీద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉందని సుంకర పద్మశ్రీ అన్నారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మోడీ ప్రాపకం కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, మోడీతో ఎలా జత కట్టాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారే తప్ప, ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టడం లేదని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో వైసీపీ, టీడీపీలు దొందు దొందేలాగా వ్యవహరిస్తున్నాయని, పెట్రోల్ ధరలు, కరోనా వైరస్ విజృంభణ చేస్తున్న, చైనా దురాక్రమణ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-24T04:31:16+05:30 IST