ప్రైవేటుకు ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-06-16T08:58:59+05:30 IST

ఇతర జబ్బుల మాదిరిగానే కరోనాకు కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు ..

ప్రైవేటుకు ప్యాకేజీ

కరోనా చికిత్సకు అనుమతించనున్న సర్కారు

రూ.5 లక్షల ప్యాకేజీ కోరిన ఓ ఆస్పత్రి

చర్చలు జరుపుతున్న ప్రభుత్వం

వారంలో స్పష్టత వచ్చే అవకాశం

శస్త్ర చికిత్సకూ ఆ పరీక్ష తప్పనిసరి

కరోనా పరీక్ష పేరిటా భారీగా వసూళ్లు

జనంతో కళకళలాడిన బెజవాడ బీసెంట్‌ రోడ్‌ 

ఒక కరోనా కేసు రావడంతో సోమవారం ఇలా కట్టడి ప్రాంతంగా మారిపోయింది


అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఇతర జబ్బుల మాదిరిగానే కరోనాకు కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాబోతున్నాయి. కరోనా చికిత్సకు ఎంత ప్యాకేజీ పెట్టాలి? ఎటువంటి నిబంధనలు అమలు చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా ప్యాకేజీని ప్రకటించింది. అంతకు ముందు నుంచే ఏపీ ప్రభుత్వం ప్యాకేజీపై చర్చలు ప్రారంభించింది. సీఎంవోలోని ఓ అధికారి కొన్ని రోజులుగా కరోనా ప్యాకేజీపై ప్రైవేటు ఆస్పత్రులతో  చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులు భారీ ప్యాకేజీ కోరడంతో ప్రభుత్వం ఒప్పుకోలేదు. వారం రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ముందడుగు పడే పరిస్థితే కనిపిస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ఒక ఆస్పత్రి కరోనా చికిత్సకు రూ.5 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కొంత మంది కరోనా రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులుగా మారిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్యాకేజీ అమలు చేస్తోంది. కరోనా సోకిన వ్యక్తి ఉన్న పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో అత్యధికంగా రూ.1.80 లక్షల వరకూ అందిస్తుంది. ఇదే ప్యాకేజీని నిర్ధారించాలని అన్ని ప్రైవేటు ఆస్పత్రులూ కోరుతున్నాయి.


ప్రభుత్వం కరోనా వస్తే 14 రోజులు మందులు వాడితే తగ్గిపోతుందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించింది. దీనికి అనుగుణంగానే లాక్‌డౌన్‌లో 90 శాతం సడలింపులు ఇచ్చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు కొండుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స చేయడమంటే కష్టతరమవుతుంది. అందుకే ప్రైవేటు ఆస్పత్రులనూ ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కరోనా చికిత్సకు ప్యాకేజీని ప్రకటించినా, ప్రకటించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల నుంచి గట్టిగా పిండేసే అవకాశం దొరికింది. ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా కరోనా ఉందేమో అన్న అనుమానం వస్తోంది. దీన్నే ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు ముందు కరోనా లేదని నిర్థారణ పరీక్ష చేయించుకోవాలని నిబంధనలు పెడుతున్నాయి. ఎలాంటి చికిత్స చేయాలన్న ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని, లేదంటే చికిత్స చేయబోమని గుంటూరులోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కరాఖండిగా చెబుతోంది.


రూ.4,500 వసూలు చేసి కరోనా టెస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల్లో రాష్ట్రవ్యాప్తం కాబోతోందనే ఆందోళనలు నెలకొన్నాయి. రోగుల నుంచి అదనంగా వసూళ్లకు ఇదో మార్గం కాబోతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్స్‌లోనూ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులిస్తోంది. ఏపీలో కొన్ని ల్యాబ్స్‌కు అనుమతులు వచ్చాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ల్యాబ్స్‌తో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-16T08:58:59+05:30 IST