ప్రతి జిల్లాలో మా ముద్ర

ABN , First Publish Date - 2020-08-11T09:05:18+05:30 IST

‘మా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చూపించాలని తపించాం. దాని కోసం రాత్రింబవళ్లూ పరుగులు తీశాం. కొన్ని పూర్తి చేశాం. మరికొన్ని చేయాల్సి ఉంది.

ప్రతి జిల్లాలో మా ముద్ర

  • అభివృద్ధికి బాటలు పరిచాం
  • రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పరిశ్రమలు, సాగునీరు తెచ్చాం
  • ఎన్నో వర్సిటీలు, కాలేజీలు పెట్టాం
  • ఏది అభివృద్ధో... ఏది విధ్వంసమో ప్రజలు అర్ధం చేసుకోవాలి: చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘మా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చూపించాలని తపించాం. దాని కోసం రాత్రింబవళ్లూ పరుగులు తీశాం. కొన్ని పూర్తి చేశాం. మరికొన్ని చేయాల్సి ఉంది. మాది అభివృద్ధి ఎజెండా. వైసీపీది విధ్వంస జెండా. గత ప్రభుత్వం చేసిన ప్రతిదీ నాశనం చేయాలన్న కోరిక తప్ప వీళ్లు కొత్తగా చేసింది లేదు. ఈ 15 నెలల్లో వీళ్లు కొత్తగా తవ్విన కాల్వ, వేసిన రోడ్డు, తెచ్చిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి చూపించమనండి... చూద్దాం’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏది అభివృద్ధి... ఏది విధ్వంసమో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా...ఏ గ్రామంలోనైనా అభివృద్ధికి సంబంధించి టీడీపీ ముద్రే కనిపిస్తుందన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా 13 జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏం చేసిందీ వీడియోను కూడా ప్రదర్శించారు. 


అనంతపురానికి ఎన్నెన్నో.

కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎనర్జీ యూనివర్సిటీ, కస్టమ్స్‌ శిక్షణ కేంద్రం తెచ్చాం. హంద్రీ-నీవా పనులు వేగవంతం చేశాం. చెర్లోపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి జిల్లాకు నీరు తెచ్చాం. దీనివల్ల కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది. బెల్‌, సుజ్లాన్‌, బెర్జర్‌ పెయింట్స్‌ కర్మాగారాలు తేవడానికి కృషి చేశాం. కర్నూలు జిల్లాకు ట్రిపుట్‌ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఓర్వకల్లు విమానాశ్రయం తెచ్చాం. ప్రపంచంలోనే పెద్దదైన మెగా విత్తన పార్క్‌కు రూపకల్పన చేశాం. రాష్ట్ర కేన్సర్‌ సెంటర్‌, మెగా సోలార్‌ పార్క్‌, పాణ్యంలో విద్యుత్‌ పరిశ్రమ, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌, కొలిమిగుండ్లలో సిమెంట్‌ పరిశ్రమల హబ్‌, హజ్‌ హౌస్‌ తెచ్చాం. కేసీ కెనాల్‌, గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు వేగవంతం చేశాం. వెలుగోడు, అవుకు టన్నెల్‌ పూర్తి చేశాం.


ముచ్చుమర్రి ప్రారంభించాం. మల్యాల ప్రాజెక్టు పూర్తి చేశాం. బానకచర్ల ద్వారా గోదావరి నీటిని సీమకు తరలించేలా డిజైన్‌ చేశాం. జగన్‌ ప్రభుత్వం వీటన్నిటినీ పడుకోబెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో గొడవలు సృష్టించడం తప్ప.. చేసిందేమీ లేదు. కడప జిల్లా గండికోట రిజర్వాయరు పనులు పూర్తి చేశాం. సీబీఆర్‌ లిఫ్ట్‌ పూర్తి చేశాం. స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శంకుస్ధాపన చేశాం. జిల్లాకు 20 పరిశ్రమలు రావడానికి కృషి చేశాం. కడప విమానాశ్రయం వాడకంలోకి తెచ్చాం. ఎడారిలాగా ఉండే చిత్తూరు పశ్చిమ ప్రాంతంలో కుప్పం వరకూ కృష్ణా జలాలు వెళ్లేలా కాల్వల పనులు వేగవంతం చేశాం. జిల్లాకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఎ్‌సజీ, ఐఐడీటీ విద్యా సంస్థలు తెచ్చాం. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేశాం. శ్రీసిటీలోకి 90 పరిశ్రమలు తెచ్చాం. హీరో మోటార్‌ సైకిళ్ల ఫ్యాక్టరీ, అపోలో టైర్ల ఫ్యాక్టరీ, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ కర్మాగారాలు తెచ్చాం. తిరుపతిని స్మార్ట్‌ సిటీని చేశాం.


ఆర్థిక రాజధానిగా విశాఖ..

విశాఖను ఆర్ధిక రాజధానిగా మలిచేందుకు కృషిచేశాం. ఫిన్‌టెక్‌ పరిశ్రమలకు జాతీయ స్ధాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొన్ని కంపెనీలు తెచ్చాం. ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఐఐఎ్‌ఫటీ విద్యా సంస్ధలు తెచ్చాం. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, పేటీఎం కంపెనీలను తెచ్చాం. మిలీనియం టవర్స్‌, మెడ్‌ టెక్‌ పార్క్‌ కట్టాం. మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టాం. బిల్‌గేట్స్‌ను కూడా విశాఖకు తీసుకొచ్చాం. లులూ గ్రూప్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వస్తే దానినీ పోగొట్టారు. ఇక జీవితంలో ఆంధ్రలో అడుగు పెట్టబోమని లులూ ప్రకటించింది. మెట్రో, ఎయిర్‌పోర్ట్‌ పనులు మొదలుపెట్టాం. 


రూ.700 కోట్లతో విశాఖలో భూగర్భ విద్యుత్‌ లైన్లు వేశాం. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం, మెడికల్‌ కళాశాల, ఉద్యానవన కళాశాల వంటివి తెచ్చాం. తోటపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేశాం. పతంజలి ఫుడ్‌ పార్క్‌ తెచ్చాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్ధలాన్ని ఈ జిల్లా పరిధిలో ఎంపిక చేయడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి బాటలుపరిచాం. శ్రీకాకుళం జిల్లాకు భావనపాడు పోర్టు తెచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రత్యేక చికిత్స కేంద్రాలు, డయాలసిస్‌ సెంటర్లు, ఆర్వో మంచినీటి కేంద్రాలు పెట్టాం. పైడి భీమవరం కేంద్రంగా ఫార్మా పరిశ్రమలు రావడానికి కృషి చేశాం.


వీరి దెబ్బకు రాకుండా పరార్‌..

‘రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్ధానంలో నిలపాలని మేం తపించాం. జగన్‌ ప్రభుత్వం వచ్చాక చివరన నిలబడే పరిస్థితి నెలకొంది. మేం తెద్దామని ప్రయత్నించినవి వీరి దెబ్బకు రాకుండా పోయాయి. ఉత్తరాంధ్రకు మేం తెచ్చినవన్నీ పోగొట్టి ఇప్పుడు పనికిమాలిన కబుర్లు చెబుతున్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. రాజకీయ విన్యాసాలు...నినాదాలు కాదు. పని చేసి చూపించలేక కులాల గురించి మాట్లాడుతున్నారు. 3-4 నెలల నుంచి జీతాలివ్వడం లేదని రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కరోనా నియంత్రణకు పీపీఈ కిట్ల కోసం డాక్టర్లు ఆందోళన చేసే పరిస్ధితి నెలకొంది. ఈ నెల ఉద్యోగుల జీతాలు ఏడో తేదీన ఇచ్చారు. ఇదొక పరిపాలనా? మూడు మాస్కులు ఇవ్వలేనివారు మూడు రాజధానులు కడతారా? మేం కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వడం చేతకాదు. రూ.10 వేల కోట్లతో అమరావతిలో కట్టిన భవనాలు పాడుబెట్టారు. కరోనా వ్యాధిని అదుపు చేయలేక చతికిలబడ్డారు.’


పరిశ్రమలు రావాలంటే విశ్వసనీయత ఉండాలి

‘పరిశ్రమలు రావాలంటే విశ్వసనీయత చాలా ముఖ్యం. పెట్టుబడులు పెట్టేవారు వాటికి రక్షణ ఉంటుందా లేదా అని చూస్తారు. మన రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారి ఒప్పందాలు సమీక్ష చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో జాతీయంగా... అంతర్జాతీయంగా పెద్ద గగ్గోలు ఏర్పడింది. కోర్టు స్టే ఇచ్చింది. కేంద్రం కూడా మొట్టికాయలు వేసింది.  మాటలు వేరు. పనులు చేయడం వేరు. పాలసీలు కాదు.. విశ్వసనీయత పెంచుకోవాలి.’


అమరావతి మార్పు... ప్రతిపక్షాలపై దాడులు తప్ప కరోనా గురించి మాట్లాడుతున్నారా? వైరస్‌ వచ్చిన వాళ్లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.7 నుంచి 10 లక్షల ఖర్చు. పేదలు ఎక్కడ నుంచి తెస్తారు?’


‘ఉత్తరాంధ్రకు మేం తెచ్చినవన్నీ పోగొట్టి ఇప్పుడు పనికిమాలిన కబుర్లు చెబుతున్నారు.’


‘టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతిదీ నాశనం చేయాలన్న కోరిక తప్ప వైసీపీ కొత్తగా చేసిందేమీ లేదు. ఈ 15 నెలల్లో కొత్తగా తవ్విన కాల్వ, వేసిన రోడ్డు, తెచ్చిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి చూపించమనండి... చూద్దాం’


‘అభివృద్ధి జరిగితేనే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం కోసమే అమరావతి. అది రాష్ట్రం కోసం. అంతే తప్ప అమరావతి కోసం రాష్ట్రం కాదు.’


‘రాజకీయ విన్యాసాలు...నినాదాలు కాదు. పని చేసి చూపించలేక కులాల గురించి మాట్లాడుతున్నారు.’ 

Updated Date - 2020-08-11T09:05:18+05:30 IST