సంస్కరణల కోసమే ఆర్డినెన్స్!
ABN , First Publish Date - 2020-04-25T08:59:45+05:30 IST
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)లో సంస్కరణల కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, సర్వీసు నిబంధనల సవరింపు, నూతన కమిషనర్ నియామకం తదితరాలకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను సవాల్

- కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి నియామకంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడాం
- వివిధ స్థాయుల్లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం.. 2014తో పోల్చితే ఈసారి తక్కువ హింసే!
- అప్పుడు 261 ఘటనలు.. ఇప్పుడు 88 మాత్రమే.. నిమ్మగడ్డ పిటిషన్‌ను కొట్టివేయండి
- హైకోర్టులో తుది కౌంటర్ వేసిన సర్కారు
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)లో సంస్కరణల కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, సర్వీసు నిబంధనల సవరింపు, నూతన కమిషనర్ నియామకం తదితరాలకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ సమర్పించిన రాష్ట్రప్రభుత్వం.. శుక్రవారం తుది కౌంటర్ దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది దీనిని దాఖలు చేశారు. తగిన చర్చల అనంతరమే ఫిబ్రవరిలో ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌లోని వివిధ స్థాయుల అధికారులతో పలు మార్లు చర్చించాకే ఈ నిర్ణయిం తీసుకున్నామని పేర్కొన్నారు. చట్ట నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూర్పు సహా ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల కమిషనర్ల పదవీకాల వ్యవధి వ్యత్యాసాల గురించి వివరించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వచ్చిన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా నెలకొన్న హింసాత్మక సంఘటనల్ని కూడా కోర్టుకు వివరించారు. అప్పుడు 261 హింసాత్మక ఘటనలు జరుగగా.. ఇప్పుడు 88 చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రతో పోలిస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వంపై, పోలీసులపై, అధికార యంత్రాంగంపై నిమ్మగడ్డ వివిధ ఆరోపణలు చేశారని, అవి సరి కావని, తనను తొలగించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్న వాదన సరి కాదని తెలిపారు. అందువల్ల నిమ్మగడ్డ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.