చించేశారు

ABN , First Publish Date - 2020-03-12T08:49:05+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం అరాచకం ప్రబలింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై

చించేశారు

  • పత్రాలపై ప్రతాపం.. దాడులతో దౌర్జన్యం
  • ప్రతిపక్ష అభ్యర్థులపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు 


చిత్తూరు: పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులే విపక్ష అభ్యర్థులను ఆలస్యంగా అనుమతించారు. కార్యాలయంలో మకాం వేసిన వైసీపీ నేతలు సుమారు పది మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించేశారు.

గుంటూరు: నర్సరావుపేట ఆర్డీవో కార్యాలయంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగారు. నామినేషన్‌ పత్రాలను చించేశారు. ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ప్రత్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.

అనంతపురం: బత్తలపల్లి మండలంలో  ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు, నేతలపై పోలీసులు చూస్తుండగానే దాడికి దిగారు.

కడప: సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని తొండూరు జడ్పీటీసీకి పోటీ పడాలనుకున్న కదిరి అరుణమ్మ, ఆమె భర్తను తరిమేశారు. నామినేషన్‌ పత్రాలను చించేశారు.


తిరుపతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం అరాచకం ప్రబలింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు దాడులకు, దౌర్జన్యాలకు దిగాయి. పలుచోట్ల విపక్ష అభ్యర్థులను కొట్టి మరీ వారి నామినేషన్‌ పత్రాలు లాక్కు ని చించివేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉదయం 11గంటల నుంచే పోలీసులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఆలస్యంగా లోపలికి పంపారు. అప్పటికే లోపల మకాం వేసిన వైసీపీ నాయకులు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించేయడం, లాక్కుని పారిపోవడం వంటివి చేశారు. జనసేన అభ్యర్థి చిన్నా రాయల్‌ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారి గది ఎదుటే లాక్కుని చింపేశారు. వాగ్వాదానికి దిగిన ఆయన్ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఏతూరు టీడీపీ అభ్యర్థి జానకి నామినేషన్‌ పత్రాలను చించేయడంతో ఆమె అక్కడే బైఠాయించి శాపనార్థాలు పెట్టారు. బీమగానిపల్లె టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వృద్ధురాలైన మంగమ్మను కిందపడేసి మరీ పత్రాలు లాక్కుని వెళ్లిపోయారు. వనమలదిన్నె ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థులు బసినేపల్లె బాలప్ప, కేశప్ప నామినేషన్‌ పత్రాలు చింపివేయడంతో బాధితులిద్దరూ రిటర్నింగ్‌ అధికారి గదిముందు ధర్నా చేశారు. సింగిరిగుంట టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డిని కిందపడేసి కొట్టి మరీ పత్రాలు చింపేశారు. నెక్కొంది ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు పెద్ద అలసాపురం నుంచి వచ్చిన టీడీపీ అభ్యర్థి కవిత వెంట వచ్చిన మహిళలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు గేటుఎక్కి కార్యాలయంలోకి వెళ్లగా వైసీపీ నేతలు ఆమె నామినేషన్‌ పత్రాలు చింపివేశారు. స్వతంత్ర అభ్యర్థి అయిన న్యాయవాది హేమంత్‌ నామినేషన్‌ వేయడానికి రాగా పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపై బైఠాయించిన ఆయన్ను స్టేషన్‌కు తరలించారు. సుగాలిమిట్ట నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయడానికి వచ్చిన హరినాయక్‌ను లోపలికి అనుమతించలేదు. గట్టిగా నిలదీసిన బాధితుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. దీంతో హరినాయక్‌ స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకునేందుకు యత్నించాడు. ఆగ్రహించిన టీడీపీ అభ్యర్థులు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

Updated Date - 2020-03-12T08:49:05+05:30 IST