మాంసం, మామిడి శుద్ధికి అవకాశాలు
ABN , First Publish Date - 2020-12-11T07:35:10+05:30 IST
గొర్రె, మేక మాంసానికి ఎగుమతితో పాటు పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా కూడా డిమాండ్ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ
అల్లానా గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గొర్రె, మేక మాంసానికి ఎగుమతితో పాటు పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా కూడా డిమాండ్ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి ఏపీ మాంసం పరిశ్రమలో పని చేస్తామని అల్లానా గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ చెప్పారు. గురువారం ‘జగనన్న జీవ క్రాంతి’ పథకం ప్రారంభం సందర్భంగా ఇర్ఫాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీలోనూ మంచి బ్రీడ్ ఉందని, అయితే దక్షిణాఫ్రికా, ఆస్ర్టేలియా, యూకే వంటి దేశాల్లో గొర్రెలు, మేకల మంచి బ్రీడ్ ఉందని, వాటిని ఇక్కడికి తెస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 150ఏళ్ల చరిత్రగల తమ సంస్థ ద్వారా.. తూర్పుగోదావరి జిల్లాలో మదర్ ప్లాంట్‌గా పెట్టి, అదే సమయంలో కర్నూలు జిల్లాలోనూ మాంసం శుద్ధి యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
ఏపీలో మామిడి శుద్ధి పరిశ్రమకూ మంచి అవకాశాలున్నాయని, దానికి కూడా తమ సహకారం అందిస్తామని, అందుకు తగిన యూనిట్లు ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు.సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం సలహాదారు జుల్ఫి మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనూ మాంస శుద్ధి యూనిట్‌ను చేపట్టవచ్చని చెప్పారు.