కార్యాలయాలు తెరవండి!

ABN , First Publish Date - 2020-04-15T09:18:39+05:30 IST

లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా అత్యవ సరం కాని అన్ని కార్యాలయాలు మూసివేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం కొందరు అధికారులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు తెరవాలని ఆదేశిస్తున్నట్లు తెలిసింది.

కార్యాలయాలు తెరవండి!

సబ్‌ రిజిస్ర్టార్లపై కొందరు అధికారుల ఒత్తిడి


అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా అత్యవ సరం కాని అన్ని కార్యాలయాలు మూసివేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం కొందరు అధికారులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు తెరవాలని ఆదేశిస్తున్నట్లు తెలిసింది. కార్యాలయాలు తెరవాలని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ శాఖకు చెందిన ఒక అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై సబ్‌ రిజిస్ర్టార్లలోనే  భయాందోళన వ్యక్తమవుతోంది. రిజిస్ర్టేషన్ల ప్రక్రియ భౌతిక దూరం పాటించేందుకు వీల్లేని వ్యవహారం. ఒక ఆస్తి రిజిస్ర్టేషన్‌కు కొనుగోలుదారుడి పక్షాన నలుగురైదుగురు, అమ్మకందారు పక్షాన నలుగురైదుగురు వస్తారు.


మధ్యవర్తులు, సాక్షులు, డాక్యుమెంట్‌ రైటర్లు అంతా ఉండాల్సి వస్తుంది. ఫొటోలు, వేలిముద్రలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షుల వేలిముద్రలు వేసేటప్పుడు కార్యాలయ సిబ్బంది వారి చేయి పట్టుకుని వేయిస్తారు. వారి ఫొటోలు తీసేటప్పుడూ కెమెరా ముందు గుంపులుగానే ఉంటారు. భౌతిక దూరం పాటించడం కుదరదు. ఇప్పుడు కార్యాలయాలు తెరవడం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదం ఏర్పడుతుందని సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-15T09:18:39+05:30 IST