ఆపరేషన్ ప్రహార్.. దండకారణ్యంపై ఫైనల్ వార్
ABN , First Publish Date - 2020-10-19T13:30:17+05:30 IST
ఆపరేషన్ దండకారణ్యకు రంగం సిద్ధమైందా? మావోయిస్టుల రెడ్ కారిడార్‌పై పట్టుకు కేంద్ర, రాష్ట్రాలు ప్రణాళికలు రచించాయా? నక్సల్స్‌తో పోరును నిర్ణయాత్మక దశకు చేర్చే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. కీలక మావోయిస్టు కోట దండకారణ్యం.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్ దండకారణ్యకు రంగం సిద్ధమైందా? మావోయిస్టుల రెడ్ కారిడార్‌పై పట్టుకు కేంద్ర, రాష్ట్రాలు ప్రణాళికలు రచించాయా? నక్సల్స్‌తో పోరును నిర్ణయాత్మక దశకు చేర్చే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. కీలక మావోయిస్టు కోట దండకారణ్యం. ఐదు రాష్ట్రాల్లోకి విస్తరించి ఉండటం మావోయిస్టులకు భౌగోళికంగా కలిసివచ్చింది. ఒక రాష్ట్రంలో దాడిచేసి.. మరో రాష్ట్రంలో తలదాచుకొనే ఎత్తుగడలతో శాంతిభద్రతలను సవాల్ చేయగలుగుతున్నారు. అయితే, కొంతకాలంగా దండకారణ్యంలోనూ కేంద్ర సాయుధ బలగాల అడుగులు పడుతున్నాయి. అంచెలంచెలుగా నక్సల్స్ ఏరివేత కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా అదుపులోకి తెచ్చుకొనే వ్యూహాన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో కలిసి కేంద్రం పకడ్బందీగా రూపొందించినట్టు సమాచారం. దీనికి పెట్టిన పేరే ‘ఆపరేషన్ ప్రహార్’. పది రకాల వ్యూహాలతో ఇది సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు నవంబరు మొదటి వారాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. అప్పుడు మొదలుపెట్టి జూన్ మొదటి వారానికల్లా ఆపరేషన్ ముగించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, కొత్తగా ఇంకో రెండు రాష్ట్రాల్లోకి విస్తరించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ దండకారణ్యంలోని కీలక ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వస్తే, కొత్త స్థావరాల ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రత్యామ్నాయ ప్రాంతాల కోసం వేటను ముమ్మరం చేసినట్టు సమాచారం. ఛత్తీ్‌సగఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రధానంగా మావోయిస్టులు ఉనికిని చాటుకుంటున్నారు. కొత్తగా బెంగాల్, బిహార్లోకీ చొచ్చుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నెల 15న ఐదు రాష్ట్రాల పోలీస్ బాస్‌లతో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్‌ను కేంద్రం నిర్వహించినట్టు సమాచారం. ఈ సమావేశంలోనే దండకారణ్యంలో ‘అప్రోచ్ మార్చ్’కోసం కొత్త ‘అటాకింగ్ పొజిషన్స్’కు పథక రచన సిద్ధమైంది.
మావోయిస్టుల అల్లి సెంట్రల్ మిలటరీ కమిషన్ దళం తలదాచుకున్న శిబిరంపై కొన్ని రోజుల క్రితం పోలీసు బలగాలు దాడి చేశాయి. ఆ క్యాంపులో కీలక డాక్యుమెంట్లు దొరికాయి. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున మిలిటరీ దాడులు చేసేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్టు ఆ పత్రాలు, అప్పటికే సేకరించుకున్న వివరాలను బట్టి కేంద్ర బలగాలు నిర్ధారణకు వచ్చాయి. దీటుగా కౌంటర్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయి. కంబాట్ అవుట్ పోస్టులను ఉగ్రవాదుల ఏరివేతలో భాగం చేయడం ఒకప్పుడు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ అనుసరించిన అణచివేత పద్ధతి. అదే విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర బలగాలు రూపొందించాయి. ఆపరేషన్ బాధ్యతలను తమిళనాడు పోలీసు అధికారి విజయకుమార్‌కు అప్పగించారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను ఈయన మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2010లో ఆయనను అప్పటి కేంద్ర ప్రభుత్వం పిలిపించుకుంది. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో సలహాదారుగా నియమించుకుని, ఆ హోదాలో దండకారణ్యం పంపించింది. పదేళ్లుగా ఆయన అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
పది పాచికలివే..
1) ఫార్వర్డ్ డిఫెన్స్ ఏరియా 2) ఫీల్డ్ ఫోర్టిఫికేషన్ 3) ఫైనల్ ప్రొటెక్టివ్ ఫైర్స్ 4)ఫైర్ అండ్ మాన్యువర్ 5) మజిల్ వెలాసిటీ 6) ఆపరేషనల్ ప్లాన్ 7) రియర్ గార్డ్ పొజిషన్ 8) సప్లమెంటరీ పొజిషన్ 9) షాక్ యాక్షన్ 10) విత్‌డ్రాయల్
సానుభూతిపరులే టార్గెట్!
ఫార్వర్డ్ డిఫెన్స్ పాలసీ అమల్లో భాగంగా అడవుల్లోకి వెళుతున్న బలగాలు వచ్చే నాలుగైదు నెలలు అక్కడే ఉండి ఆపరేషన్లు నిర్వహిస్తాయి. అదే సమయంలో మావోయిస్టుల ఏరివేతనూ, వారి సానుభూతిపరుల భావజాల ప్రచారాన్నీ ఏకకాలంలో ఎదుర్కొనబోతున్నారు.