అన్నీ కోతలే!

ABN , First Publish Date - 2020-03-02T07:19:40+05:30 IST

పథకాల రద్దులో ఏపీ రికార్డు సృష్టిస్తోంది. ఇంత పెద్దఎత్తున పథకాలు రద్దుచేసి, బిల్లులు పెండింగ్‌ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉంటుందేమో...

అన్నీ కోతలే!

  • సంక్షేమ జపం చేస్తూనే రద్దుల బాట
  • పదుల కొద్దీ పథకాలకు మంగళం


ఎడాపెడా పథకాల రద్దు.. సంక్షేమంలో భారీగా కోతలు... చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌... ఇదీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఓవైపు చెబుతూనే... గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గంపగుత్తగా రద్దు చేసేస్తున్నారు. మరికొన్ని రద్దు చేయకున్నా అంపశయ్యపైకి ఎక్కించేశారు. వాటి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అప్పులు తెచ్చిమరీ చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో రైతులు, చిన్నస్థాయి కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


  • అంపశయ్య పైకి చేరిన మరికొన్ని...
  • రద్దయినవాటి జాబితా చాంతాడంత
  • ఎడాపెడా తీసేసిన వైసీపీ ప్రభుత్వం
  • కొన్ని పాతవే పేర్లు మార్చి ఏమార్పు 
  • పలు పథకాలకు బిల్లులు పెండింగ్‌లో
  • సంక్షేమానికి దూరమైన లబ్ధిదారులు


అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పథకాల రద్దులో ఏపీ రికార్డు సృష్టిస్తోంది. ఇంత పెద్దఎత్తున పథకాలు రద్దుచేసి, బిల్లులు పెండింగ్‌ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉంటుందేమో అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతాచేసి నూతనంగా అమలు చేస్తున్న పథకాల వల్ల ఇస్తున్న కొత్త లబ్ధి ఏమైనా ఉందా అంటే... అదీ అనుమానమే అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గర్భిణులను కాన్పుకోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, ప్రసవానంతరం శిశువుల కోసం ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ పథకాలు అమలయ్యేవి. పేదలు కూడా ప్రతి పండుగను సంతోషంగా చేసుకునేందుకు కానుకలు ఇచ్చారు. నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతి ఇచ్చేవారు. వివాహ సమయంలో పెళ్లికానుకలు ఇచ్చారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే చంద్రన్న బీమా పేరుతో రూ.2లక్షలు చేతికందేలా పథకాన్ని అమలు చేశారు. ఇలాంటి వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసేసింది. లేకుంటే పెండింగ్‌లో పెట్టింది. 


4.30లక్షల ఇళ్ల రద్దు 

గత ప్రభుత్వం 4.30లక్షల మందికి ఇళ్లు కేటాయించింది. దీంతో పలువురు లబ్ధిదారులు అప్పటివరకు తమకున్న పాడుపడ్డ ఇళ్లు, గుడిసెలు కూల్చేసుకున్నారు. కొత్త ఇల్లు నిర్మించుకుందామని ఆశపడ్డారు. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేసేయడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి కొంతమంది మంజూరైంది కాబట్టి డబ్బులొస్తాయన్న ఆశతో అప్పుచేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి కేటాయింపు రద్దు కావడంతో సబ్సిడీ రాక, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్నారు. 


వసతి దీవెనలో కోత 

గతంలో సగటున ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.14వేలు చొప్పున స్కాలర్‌షిప్‌, కాస్మెటిక్‌ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో వచ్చేది. ఇప్పుడు వాటన్నింటినీ రద్దుచేసి ఆ స్థానంలో జగనన్న వసతి దీవెన పేరుతో కొత్త పథకం తెచ్చారు. ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్‌ చదివేవారికి రూ.15వేలు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.20వేలు అందిస్తున్నారు. గతంలో ఈ ప్రయోజనం పొందే విద్యార్థుల సంఖ్య 16లక్షలు ఉండగా ఇప్పుడు 11లక్షలకు తగ్గించేశారు. అదేవిధంగా ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేశారు. 


సీఎంఆర్‌ఎఫ్‌ సాయం దూరం 

హఠాత్తుగా జబ్బు పడితే శస్త్రచికిత్స కోసం అప్పటికప్పుడు ప్రభుత్వ సాయం అందదు. అలాంటి సందర్భాల్లో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారు తర్వాత ప్రభుత్వానికి బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్‌మెంట్‌ వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తేదీ కంటే ముందున్న ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులన్నీ రద్దు చేసేశారు. వాటికి సాయం అందించలేదు. కొన్ని మినహా మిగతా వాటన్నింటినీ అసలు డేటా నుంచే తొలగించేశారు. దీంతో అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. 


విదేశీ విద్యకు ఆగిన సాయం 

విదేశాల్లో చదువుకునే కాపు విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పేరిట ఏడాదికి రూ.10లక్షల వరకు సాయం అందించారు. కానీ ఇప్పుడు దాన్ని ఆపేయడంతో గతేడాది ప్రభుత్వ సాయంతో విదేశాలకు వెళ్లినవాళ్లు ఇప్పుడు రెండో ఏడాది డబ్బులు అందక సతమతమవుతున్నారు. 


పెండింగ్‌లతో అవస్థలు: పథకాలను రద్దు చేయడం కంటే చేసుకున్న పనులకు బిల్లుల చెల్లింపు పెండింగ్‌లో పెట్టడం ఇబ్బందికరంగా మారింది. తాము ఖర్చుచేసిన మొత్తం, రావాల్సిన సబ్సిడీ రెండూ ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో రైతులు పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు మినీగోకులం పథకం తెచ్చారు. 2పశువులు ఉండే షెడ్‌కు రూ.లక్ష, 3పశువులు ఉంటే రూ.1.5లక్షలు, 6పశువులు ఉండే షెడ్‌కు రూ.1.80లక్షలు ఇస్తామన్నారు. ఇందులో 10శాతం లబ్ధిదారుడు భరించాలి. ఈ పథకం కింద 37వేల మంది రైతులు 10శాతం మేర డీడీలు కట్టారు. వారిలో కొందరు షెడ్‌లు వేసుకున్నారు. ఇంకొందరు సగం వరకు వేసుకుని సబ్సిడీ అందకపోవడంతో ఆపేశారు. ఇలాంటివారంతా ఇప్పుడు బిల్లులు పెండింగ్‌లో పడటంతో లబోదిబోమంటున్నారు. పశుగ్రాస అవసరాలు తీర్చడం, పాల ఉత్పత్తి పెంచడం లక్ష్యంగా గతంతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పథకం కింద గడ్డి సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు కౌలు అందిస్తామన్నారు. పలువురు రైతులు గడ్డిసాగు చేసినా ఇప్పటికీ ఆ కౌలు డబ్బు రాలేదు. 


కాంట్రాక్టర్లకు ఇరకాటం 

ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సిమెంటు రోడ్లనుంచి, నీరు-చెట్టు కింద చిన్నచిన్న పనులు చేసినవారు భారీసంఖ్యలో ఉన్నారు. వీరంతా గ్రామాల్లో ఉండే చిన్నపాటి కాంట్రాక్టర్లు. వీరికీ బిల్లులు పెండింగ్‌ పెట్టేయడంతో ఇక కాంట్రాక్టులంటేనే బాబోయ్‌... అనే పరిస్థితికి చేరుకున్నారు. రాజధాని అమరావతిలో పనులు చేసినవారికీ బిల్లులు చెల్లించకపోవడంతో వారికింద పనిచేసిన సబ్‌ కాంట్రాక్టర్లకూ ఇరకాటంగా మారింది. బిల్లులన్నీ ఆగిపోవడంతో రైతులు, చిన్నస్థాయి కాంట్రాక్టర్లు మనుగడ కోసం ఇబ్బంది పడుతుండగా, పెద్దస్థాయిలో ఉన్నవారి బిల్లులు చెల్లింపులు చేయకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లిపోతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


బీసీ పథకాల్లో కోత 

బీసీలకు అందించే పథకాల్లోనూ కోత విఽధించారు. గతంలో బీసీల్లోని 137కులాలకు పలు పథకాలు అమలయ్యేవి. ఇప్పుడు వాటిని కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేశారు. బీసీల్లోని అన్ని కులాల కోసం గత ప్రభుత్వం సమాఖ్యలు ఏర్పాటు చేసింది. రజక, నాయీబ్రాహ్మణ, సగర, వడ్డెర, ఉప్పర, కృష్ణబలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్రాజ, మేదర, విశ్వబ్రాహ్మణ, కల్లుగీత కార్మికులకు ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి.


అత్యంత వెనుకబడిన బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ ప్రారంభించారు. వీటిద్వారా ఐదేళ్లలో లక్ష మందికిపైగా ఆర్థిక యూనిట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ స్వయం ఉపాధి యూనిట్లన్నింటినీ ఆపేశారు. ఆర్థిక యూనిట్ల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించినా మంజూరు చేయకుండా ఆపేశారు. బీసీల్లో వృత్తిదారుల కోసం గతంలో ఆదరణ పథకం ఉండగా దాన్నీ ఆపేశారు. ఆ పథకం కింద ఇచ్చే పనిముట్ల ఖర్చులో 10శాతం లబ్ధిదారులు చెల్లించాలి. గతేడాది చెల్లించిన ఆ 10శాతం మొత్తం కూడా వెనక్కివ్వలేదు.


పండుగ కానుకలేవీ... 

సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫాల కింద ఆయా వర్గాల్లో పేదలకు పండుగల పూట అవసరమైన సరుకులు అందించేవారు. తెల్లరేషన్‌ కార్డులున్న 1.40కోట్ల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందేది. ప్రతి కుటుంబానికి నెయ్యి, కందిపప్పు, నూనె, స్వీట్‌, సేమ్యా తదితర వస్తువులు అందించేవారు. ఇప్పుడా పథకం రద్దయింది. 


రద్దయిన పథకాలు 

రైతు రుణమాఫీ, అన్న క్యాంటీన్లు, రంజాన్‌, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, చంద్రన్న బీమా, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు, విద్యుత్‌ పీపీఏలు, ఉచిత ఇసుక, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రైతురథం, ఎన్టీఆర్‌ జలసిరి, నీరు-చెట్టు, ఎన్టీఆర్‌ బేబీకిట్‌, ఆదరణ పథకం, పెళ్లి కానుకలు, అన్న అమృతహస్తం, చంద్రన్న చేయూత, మాఇంటి మహాలక్ష్మి, మహాప్రస్థానం, దివ్యదర్శనం






అన్న క్యాంటీన్లకు మంగళం  

నగరాలు, పట్టణాల్లో పనుల కోసం ఎక్కడినుంచో వచ్చిన కార్మికులు భోజనం కోసం కనీసం రూ.60 ఖర్చుపెట్టాల్సి వచ్చేది. కానీ అన్నక్యాంటీన్ల ద్వారా సబ్సిడీ ధరతో రూ.5కే ఆహారం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 205క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. కార్మికులకు ఒక వరంలా ఉపయోగపడిన ఈ పథకాన్ని రద్దు చేసేశారు. వీటిని మళ్లీ ప్రారంభిస్తామని చెప్పినా ఇంతవరకూ ఆచరణలోకి రాలేదు. కనీసం పేరు మార్చి అయినా ఇలాంటి పథకాలు అమలు చేయవచ్చనేది విశ్లేషకుల మాట. అలాగే చంద్రన్న బీమా ద్వారా గతంలో మూడేళ్లలో రూ.2,200కోట్లు పేదలకు అందాయి. కానీ ఇప్పుడా పథకం కూడా తెరమరుగైపోయింది. 




ఊసులేని ఉచిత ఇసుక 

గతంలో ఇసుకను ఉచితంగా అందించేవారు. రవాణా ఖర్చులు చెల్లిస్తే సరిపోయేది. ఈ పథకం రద్దుతో ఏర్పడిన గందరగోళం, నష్టం అంతా ఇంతా కాదు. నాలుగైదు నెలలు కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. భవనాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకున్నవాళ్లు ఇసుక కోసం నాలుగైదు రెట్లకు పైగా వ్యయం చేయాల్సి వచ్చింది. నిర్మాణాలు ఆపినా, కొనసాగించినా నష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల్లో యథేచ్ఛగా సాగుతున్న దోపిడీతో వినియోగదారుడిపై భారం పెరిగిపోయింది. ఇసుక రూపంలో వినియోగదారులపై కొన్ని వేల కోట్ల భారం పడుతోంది. పోనీ ఆ డబ్బు కనీసం ప్రభుత్వానికి అయినా చేరుతోందా అన్న ప్రశ్నకు సమాధానం బహిరంగ రహస్యమే. 


సిగ్నల్‌ డల్‌.. కష్టాలు ఫుల్‌!

గడప వద్దకే పింఛన్ల కార్యక్రమంలో సిగ్నల్‌ కష్టాలు వలంటీర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సముద్ర తీర గ్రామమైన పేరుపాలెం సౌత్‌ శివారు మోళ్లపర్రులో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పంతం మణికంఠ ఆదివారం ఉదయం పింఛన్‌ ఇచ్చేందుకు వేముల రాధాకృష్ణ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లోకి సిగ్నల్స్‌ రాకపోయేసరికి ఆ వృద్ధుడిని మణికంఠ సిగ్నల్స్‌ వచ్చే ప్రాంతానికి చేతులపై మోసుకొచ్చి వేలిముద్ర వేయించుకుని పింఛను అందించారు. పని పూర్తి కాగానే తిరిగి ఇంటి వద్ద వదిలిపెట్టారు.

- మొగల్తూరు


Updated Date - 2020-03-02T07:19:40+05:30 IST