వర్సిటీల్లో ఆన్‌లైన్‌ సేవలే

ABN , First Publish Date - 2020-03-04T08:59:16+05:30 IST

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ-ఆఫీసు, బయోమెట్రిక్‌ హాజరు, కంప్యూటరీకరణ ప్రక్రియను పక్కాగా...

వర్సిటీల్లో ఆన్‌లైన్‌ సేవలే

  • ఈ-ఆఫీసు, బయోమెట్రిక్‌ హాజరు అమలు 
  • కంప్యూటరీకరణ ప్రక్రియ వెంటనే పూర్తి
  • సీఎఫ్‌ఎస్‌ఎస్ ద్వారా ఆన్‌లైన్‌ వెబ్‌ ప్లాట్‌ఫాం
  • ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు 

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ-ఆఫీసు, బయోమెట్రిక్‌ హాజరు, కంప్యూటరీకరణ ప్రక్రియను పక్కాగా అమల్లోకి తీసుకురానున్నారు. ప్రైవేట్‌ వర్సిటీలకు ధీటుగా సేవలు అందించే అంశంపైనా చర్చ జరుగుతోంది. సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ సిస్టమ్స్‌(సీఎ్‌ఫఎ్‌సఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌ వెబ్‌ ప్లాట్‌ఫాం తయారుచేసేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ-ఆఫీసు నిర్వహణకు సంబంధించి ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.


ఉన్నత విద్యపై సీఎం జగన్‌ తాజాగా చేపట్టిన సమీక్ష సందర్భంగా చేసిన సూచన మేరకు ఉన్నత విద్యాశాఖ అన్ని వర్సిటీలకు ఆదేశాలు ఇచ్చింది. వర్సిటీల్లో ఆన్‌లైన్‌ సర్వీసులు పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలని, అన్ని విభాగాల్లో ఈ-ఆఫీసు విధానం అమలుపై గతంలోనూ ఉన్నత విద్యాశాఖ సర్క్యులర్‌ జారీచేసింది. పేపర్‌ వర్క్‌ ఎత్తేయాలని, బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని సూచించింది. వీటిని ప్రైవేట్‌ వర్సిటీలు మాత్రం పక్కాగా అమలుచేస్తున్నా ప్రభుత్వ వర్సిటీలు మాత్రం అమలులో ఎదురవుతున్న సమస్యలను ఏకరువు పెడుతున్నాయి. దీనిపై తాజాగా సీఎం ప్రస్తావించడంతో పాటు కంప్యూటరీకరణ, ఆన్‌లైన్‌ సేవల దిశగా చర్యలకు ఆదేశాలిచ్చారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి(డీఎస్‌టీ, డీపీటీ) నిధులొచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర వర్సిటీలు ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతున్నాయి.


కొత్త వర్సిటీల్లో రెండు దశాబ్దాలుగా ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టకపోవడం, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బంది పనిచేయడం వల్ల, ఈ-ఆఫీసు అమలు చేయలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిధుల సమస్యతో పరిశోధనలు అంతంత మాత్రమే. ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే డీడీలు, నగదు రూపంలో జరుగుతున్నందున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నత విద్యాశాఖ నియమించిన నిజనిర్ధారణ కమిటీలు కూడా ఇదే విషయాన్ని తేల్చడం గమనార్హం. వర్సిటీల్లో నిరంతర పర్యవేక్షణ యంత్రాంగం లేకపోవడంతో అక్రమాలు, అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు, ఫ్యాకల్టీ నియామకాలు వంటి అంశాల్లో తనవంతు నిర్ణయాలు తీసుకుంటే తప్ప, తమ ఆదేశాల అమలుకు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.

Updated Date - 2020-03-04T08:59:16+05:30 IST