ఉల్లి కిలో 50

ABN , First Publish Date - 2020-09-25T08:39:49+05:30 IST

రాష్ట్రంలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. మొన్నటి దాకా రూ.50కి 3కిలోలు అమ్మిన ఉల్లిపాయలు ఇప్పుడు రిటైల్‌గా కిలో రూ.50

ఉల్లి కిలో 50

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. మొన్నటి దాకా రూ.50కి 3కిలోలు అమ్మిన ఉల్లిపాయలు ఇప్పుడు రిటైల్‌గా కిలో రూ.50 పలుకుతోంది. ధర ఇంకాస్త పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. నెల రోజులుగా కురిసిన అధిక వర్షాలకు ఉల్లి పంట చాలా దెబ్బతింది. పాయలు నాణ్యత లోపించాయి. దీంతో గత పక్షం రోజులు కర్నూలు మార్కెట్‌లో క్వింటా రూ.3వేలు పలికిన సరుకు ఇప్పుడు రూ.2,700 మాత్రమే పలుకుతోంది. రైతుకు ఎక్కువ ధర లభించకపోయినా, వ్యాపారులు ధరలు పెంచారు.


ఆరుదల పాయలు రిటైల్‌ మార్కెట్‌లో రూ.50 ఉండగా, రెండోరకం కిలో రూ.40 చెప్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర పెరగడంతో రైతుబజార్లలో నాణ్యమైన సరుకు ఉండటం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. రాయలసీమలో ఉల్లి పంటకు అధిక వర్షాలు చేటు చేయడంతో సరుకు నాణ్యత తగ్గి, ఎగుమతులు మందగించాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఉల్లిపంట అధిక వర్షాలకు కొద్దిగా దెబ్బతింది. అయితే మహారాష్ట్ర సరుకు ఆరుదలగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల వ్యాపారులు షోలాపూర్‌ ప్రాంతం నుంచి దిగుమతి చేస్తున్నారు.


ఉల్లికి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడేనికి ఇటు కర్నూలు, అటు మహారాష్ట్ర సరుకు దిగుమతి అవుతోందని చెప్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లిని కొనుగోలు చేస్తున్న హోల్‌సేల్‌ వ్యాపారులు తరుగు, రవాణా ఖర్చులు కలిపి క్వింటా రూ.4వేలు దాకా అమ్ముతున్నారు. దీంతో రిటైల్‌గా కిలో రూ.50కి తగ్గడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో హోటల్‌ వ్యాపారాలు లేక వినియోగం తగ్గింది.

ప్రస్తుతం హోటళ్లు, టిఫిన్‌, మసాలాబండ్లు, రెస్టారెంట్లు యథావిధిగా నిర్వహిస్తుండటంతో ఉల్లి వినియో గం పెరిగింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర పెరుగుతోందని వ్యాపారులు చెప్తున్నారు. రైతుబజార్లలో రాయితీపై ఉల్లి సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. 


Updated Date - 2020-09-25T08:39:49+05:30 IST