ఒక్కరోజే 765

ABN , First Publish Date - 2020-07-05T08:42:07+05:30 IST

కరోనా మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. శనివారం 765కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 727మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి

ఒక్కరోజే 765

  • పలాసలో ఏడుగురు వలంటీర్లకు
  • పిఠాపురంలో కొవిడ్‌ మృతుడి ద్వారా 
  • 14 మందికి వ్యాధి సంక్రమణ 
  • సీఎం నివాసం భద్రతా సిబ్బందికి
  • మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేకూ 
  • వేర్వేరు జిల్లాల్లో 12మంది మృతి
  • 17699కి చేరిన పాజిటివ్‌లు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : కరోనా మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. శనివారం 765కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 727మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితోకలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 17,699కి చేరింది. శనివారం కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, విశాఖలో ఇద్దరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 218కి పెరిగాయి. గుంటూరులో రికార్డు స్థాయిలో 176 కేసులు వచ్చాయి. జిల్లాలోని ఓ ముఖ్య అధికారి గన్‌మన్‌కు కరోనా సోకింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తొగర్చేడులో నాలుగు కుటుంబాలకు చెందిన 27మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఇటీవల మృతిచెందారు. మరణానంతర పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు 14మందికి వైరస్‌ వ్యాపించింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏడుగురు వార్డు వలంటీర్లకు పాజిటివ్‌ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మాజీమంత్రికి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌కు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకి వైరస్‌ సోకింది. తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసం వద్ద విధులు నిర్వర్తించే 10మంది గార్డులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీసీఆర్డీయేలో డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగుల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయన్న వార్తలతో మిగిలినవారు బిక్కుబిక్కుమంటున్నారు. సీఆర్డీయే, ఏడీసీల్లోని ఉద్యోగులందరికీ పరీక్షలు చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కాగా, పాఠశాల విద్య కమిషనరేట్‌(ఇబ్రహీంపట్నం)లో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో సిబ్బంది అందరికీ వారం(6నుంచి 12వరకు) రోజులు ఇంటినుంచే పని చేసేందుకు అనుమతి ఇస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2020-07-05T08:42:07+05:30 IST