రాష్ట్రంలో 8 కేసులు

ABN , First Publish Date - 2020-03-25T07:44:45+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఏపీలో ఏడు కరోనా కేసులు నమోదుకాగా.. .

రాష్ట్రంలో  8  కేసులు

  • చిత్తూరులో తొలి కరోనా కేసు 
  • శ్రీకాళహస్తి వాసికి నిర్ధారణ
  • లండన్‌ నుంచి వచ్చిన టెకీ

అమరావతి, తిరుపతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఏపీలో ఏడు కరోనా కేసులు నమోదుకాగా.. తొలిసారిగా చిత్తూరు జిల్లాలోనూ ఒకరికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శ్రీకాళహస్తికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు (25) లండన్‌ నుంచి ఈనెల 19న చెన్నై ఎయిర్‌పోర్టు మీదుగా స్వగ్రామం చేరుకున్నాడు. దగ్గుతో ఇబ్బంది పడుతూ సోమవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో వైద్యులు అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. స్విమ్స్‌ సెంట్రల్‌ వైరాలజీ ల్యాబ్‌లో అతడి నమూనాలు పరీక్షించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు, ప్రయాణించిన కారు డ్రైవర్‌ను, ఈ ఐదు రోజుల్లో ఎవరెవరిని కలిశారన్న సమాచారాన్ని అధికారులు తెలుసుకుంటున్నారు. కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 251 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 229 కేసులు నెగెటివ్‌ వచ్చాయి. 8 కేసులు పాజిటివ్‌గా తేలాయి. 14 మంది రిపోర్టులు రావాలి. ప్రస్తుతం విదేశాల నుంచి 14,907 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 13,290మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 2723 మందికి 28 రోజుల పర్యవేక్షణ పూర్తి అయింది. 


గుంటూరులో పాజిటివ్‌ కేసుల్లేవు

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జొన్నలగడ్డ యాస్మిన్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఐడీహెచ్‌, జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్సలు పొందుతున్న 12 మంది నుంచి నమూనాలు సేకరించి స్విమ్స్‌కు పంపామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన 21 మంది రోగుల నుంచి నమూనాలు తీసి పంపగా.. 9 మందికి నెగెటివ్‌ వచ్చింది. మంగళవారం పంపిన 12 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో సోమవారం చేరి చికిత్స పొందుతున్న గుంటూరు శ్రీనివాసరావు పేటకు చెందిన ఎం ఆదినారాయణ (64) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన 15 ఏళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన సమయంలో ఊపరితిత్తుల సమస్య, ఆయాసంగా ఉండటంతో కరోనా అనుమానంతో అతని నమూనాలు పరీక్షకు పంపారు. ఫలితం రావాల్సి ఉండగా.. ఈ లోపు చనిపోయారు. అనంతపురం జిల్లాలోనూ కరోనా కోరలు చాస్తోంది. మంగళవారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 19 అనుమానిత కేసులు నమోదు కాగా.. వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చినవారే కావడం గమనార్హం.


Read more