మహానాడులో ఎన్ఆర్ఐ-తెలుగుదేశం
ABN , First Publish Date - 2020-05-29T08:45:46+05:30 IST
: తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎన్ఆర్ఐ-తెలుగుదేశం కూడా భాగస్వామ్యమైంది. ఏపీ, తెలంగాణతో పాటు అమెరికాలోని పలువురు తెలుగుదేశం అభిమానులు

- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 10 వేలమందికి సాయం
- బియ్యం, నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎన్ఆర్ఐ-తెలుగుదేశం కూడా భాగస్వామ్యమైంది. ఏపీ, తెలంగాణతో పాటు అమెరికాలోని పలువురు తెలుగుదేశం అభిమానులు కూడా వెబినార్ ద్వారా మహానాడులో పాల్గొన్నారు. అమెరికా నుంచి సుమారు వెయ్యిమంది జూమ్ వెబినార్ ద్వారా మహానాడులో పాల్గొని ఎన్టీఆర్‌ను తలచుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం ఏపీలోని 10 వేలమంది బ్రాహ్మణులు, క్రైస్తవులు, ముస్లింలు, బీసీ వర్గాల్లోని పేదలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, పళ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ-తెలుగుదేశం తరఫున వారి ప్రతినిధులు రాష్ట్రంలోని 25 ముఖ్య నగరాలు, పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సరుకుల పంపిణీని రాజమండ్రిలో ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమా, విజయనగరంలో అశోక్ గజపతిరాజు, నందిగామ, తణుకులో మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, రాధాకృష్ణ, ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెదకాకానిలో నరేంద్రకుమార్, గుంటూరులో కోవెలమూడి నాని, దొడ్డపనేని రాజేంద్ర, ఉప్పుటూరి సీతామహాలక్ష్మి ప్రారంభించారు. గత 50 రోజుల నుంచి వీరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఏపీ విజన్‌ని జగన్ చంపేశాడు: వాసుపల్లి
లోటు బడ్జెట్లో ప్రారంభమైన ఏపీని ఆర్థిక వృద్ధి వైపు నడిపిన నాయకుడు చంద్రబాబు, కానీ రాష్ట్రాన్ని దివాళా తీయించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ విమర్శించారు. గురువారం మహానాడులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం అనే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ఏడాదిలో కృష్ణానీటిని హైదరాబాద్‌కు తరలించిన చంద్రబాబు, గోదావరిపై పట్టిసీమ నిర్మించి, పోలవరం 71% పూర్తి చేశారని కొనియాడారు. కానీ జగన్ ఏపీ విజన్‌ని చంపేశారని ధ్వజమెత్తారు.