ఏపీలో ఎన్‌పీఆర్‌ నిలిపేయాలి

ABN , First Publish Date - 2020-03-02T08:23:51+05:30 IST

‘ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న ఎన్‌పీఆర్‌ మీద స్టే కాదు... దాని అమలును ఏపీలో సీఎం జగన్‌ నిలిపేయాలి. బీజేపీ, ప్రధాని మోదీ భయంతో అమలు చేయాలని...

ఏపీలో ఎన్‌పీఆర్‌ నిలిపేయాలి

  • అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీర్మానం చేయాలి 
  • పేదల ఓట్లతోనే గెలిచానని జగన్‌ మర్చిపోకూడదు
  • బీజేపీ, ప్రధానికి భయపడి చేస్తే బాయ్‌కాట్‌ చేస్తాం 
  • వైఎస్‌ ఉంటే అమలును 2నిమిషాల్లో రద్దు చేసేవారు 
  • ఎన్‌ఆర్‌సీపై ప్రధాని మోదీ, అమిత్‌షా పచ్చి అబద్ధాలు  
  • గుంటూరు సింహగర్జనలో ఎంఐఎం అధినేత ఒవైసీ


గుంటూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న ఎన్‌పీఆర్‌ మీద స్టే కాదు... దాని అమలును ఏపీలో సీఎం జగన్‌ నిలిపేయాలి. బీజేపీ, ప్రధాని మోదీ భయంతో అమలు చేయాలని చూస్తే బాయ్‌కాట్‌ చేస్తాం. జగన్‌ను గెలిపించింది సంపన్నులు కాదు... అల్పసంఖ్యాక, బలహీన వర్గాలని గుర్తుంచుకోవాలి’’ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ హెచ్చరించారు.


జగన్‌ తండ్రి వైఎస్‌ బతికుంటే ఇన్నిరోజుల సమయం తీసుకొనేవారు కాదని, రెండు నిమిషాల్లో ఎన్‌పీఆర్‌ అమలును రద్దు చేసేవారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఈ అంశంపై తీర్మానం చేయాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జమియత్‌ ఉలమా గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సింహగర్జన బహిరంగ సభ జరిగింది. జమియత్‌ ఉలమా ఏపీ, తెలంగాణ అధ్యక్షుడు పీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌ అధ్యక్షత వహించిన ఈ సభలో అసదుద్దీన్‌ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ మధ్యన ఎలాంటి భేదం లేదని, ఎన్‌పీఆర్‌ జరిగిందంటే ఢిల్లీలో కూర్చుని కూడా ఎన్‌ఆర్‌సీ చేసేయవచ్చని చెప్పారు. సీఏఏ ద్వారా ముస్లిం పౌరసత్వం రద్దుకాదని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా చెబుతోన్న మాటలు పచ్చి అబద్ధాలని ఒవైసీ కొట్టిపారేశారు. ఎన్‌ఆర్‌సీ హైదరాబాద్‌లో అమలు చేస్తే 10లక్షల మందికి పౌరసత్వం రద్దు అవుతుందన్నారు. ఈ చట్టాలు టాడా, పోటా కంటే ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు.


ఎన్‌పీఆర్‌ పేరుతో ఎవరైనా జనాభా లెక్కలకు వస్తే ప్రజలు జాతీయ జెండా చూపించి వాళ్లని ఆ వీధిలోకి రానీయకుండా అడ్డుకోవాలని ఒవైసీ పిలుపునిచ్చారు. ‘ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 45మంది అమాయకులు బలయ్యారు. వేలకోట్ల రూపాయల ఆస్తులు దహనమయ్యాయి. ముస్లింల మసీదులని కూల్చివేశారు. గుజరాత్‌లోనూ ఇదే తరహా మారణకాండ మోదీ సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడూ మౌనం పాటిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలే ఐసి్‌సకు ఊతమిస్తున్నాయి. ఇక్కడ ముస్లింలపై జరుగుతున్న దాడులను ఆ సంస్థ తన అధికారిక పత్రికలో ప్రచురించుకొంటూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది’ అని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఒవైసీ కోరిన మేరకు సభకు హాజరైన వారందరూ తమ సెల్‌ఫోన్లలో లైట్లు ఆన్‌ చేయడంతో స్టేడియం ఎల్‌ఈడీ కాంతులతో వెలిగిపోయింది. కాగా, జాతి, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని చూస్తోన్నారని పీపుల్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జోగేందర్‌ కవాడే ఆగ్రహం వ్యక్తం చేశారు. 70రోజుల నుంచి షహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళలు చేస్తోన్న ఆందోళన సీఏఏ కోసం కాదని, దేశ సమైక్యత కోసమన్నారు.


‘స్వాతంత్య్ర సంగ్రామంలో 70వేల మంది ముస్లిం మైనార్టీలు అశువులుబాశారు. అప్పట్లో ఈ ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ లేవు. ఆంగ్లేయులకు వారసులైన వీళ్లా దేశభక్తి పాఠాలు చెప్పేది’ అని ఆయన ప్రశ్నించారు. దేశద్రోహులు దేశభక్తి గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 


తీర్మానం చేయకపోతే రాజీనామా: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 

గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సభలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలీ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, టీడీపీ నుంచి నసీర్‌ అహ్మద్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2020-03-02T08:23:51+05:30 IST