ద్వారకా తిరుమలలో పనిచేయని సీసీ కెమెరాలు
ABN , First Publish Date - 2020-05-24T16:17:13+05:30 IST
ద్వారకా తిరుమలలో స్వామివారి భద్రత ప్రశ్నర్థకంగా మారింది.

ఏలూరు: ద్వారకా తిరుమలలో స్వామివారి భద్రత ప్రశ్నర్థకంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఆలయాన్ని మూసివేశారు. అయితే ఈ నెల 3వ తేదీ నుంచి 10 వరకు స్వామివారి వైశాఖ మాస కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొందరు వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది వివాదం కావడంతో కొందరికి మెమోలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు.
అయితే వీఐపీల దర్శనానికి ఈవోనే అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికి ఈవోపై అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఆలయంలో సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. ఆలయం లోపల, ముఖమండపంలో, గర్భాలయంలో, అంతరాలయంలో సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారు. ఆలయం వెలుపల మాత్రం సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. దీంతో ఆలయ అంతర్గ భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో కీలక ప్రదేశాల్లో సీసీకెమెరాలు పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే విషయంపై ఈవో వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.