నామినేషన్‌ వేశారో..కేసులే!

ABN , First Publish Date - 2020-03-12T10:31:27+05:30 IST

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్ల చివరిరోజైన బుధవారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఘటనలు

నామినేషన్‌ వేశారో..కేసులే!

  • ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పోలీసుల ఫోన్లు

మాచర్ల, కారంపూడి, దుర్గి మార్చి 11: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్ల చివరిరోజైన బుధవారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఘటనలు చోటుచేసుకున్నాయి. కారంపూడి మండలంలో మంగళవారం రాత్రి నుంచే పోలీసులు టీడీపీ నేతలందరికీ ఫోన్లు చేసి నామినేషన్లు వేయవద్దని, వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో 15 ఎంపీటీసీలు ఉండగా, 5 స్థానాలకే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచె వేసి, పోలీసులకు ఫారాలు చూపి, ఏ పార్టీనో చెప్పి, సెల్‌ఫోన్‌ నంబరు ఇస్తేనే, అదీ కొద్దిమందిని మాత్రమే లోపలకు పంపించారు.  కారంపూడి-4 ఎంపీటీసీ స్థానానికి దుర్గ(టీడీపీ) నామినేషన్‌ ఫారాలను అధికారి చేతికి ఇవ్వగా, కొందరు వ్యక్తులు ఆ ఫారాలను లాక్కెళ్లిపోయారు. దుర్గ ఆందోళన చేయగా, పోలీసులు ఆ పత్రాలను తెప్పించారు. ఈ మండలంలో బీజేపీ, జనసేన నుంచి మూడేసి స్థానాల్లో నామినేషన్లు వేయగలిగారు. మాచర్ల మండలం జమ్మలమడకలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆలేటి కోటమ్మను వైసీపీ కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. దీంతో భయపడిన కోటమ్మ కుటుంబం ఇంటికి తాళాలు వేసి ఊరి విడిచి వెళ్లిపోయింది. టీడీపీకి కంచుకోటగా పేరొందిన దుర్గి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయలేకపోయారు. అడిగొప్పుల-1 ఎంపీటీసీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వయింది. నాగెండ్ల సాంబశివరావు తన భార్యతో నామినేషన్‌ వేయించేందుకు బుధవారం తీసుకురాగా, వైసీపీ వర్గీయులు అడ్డుకుని తరిమేశారు.


రిస్క్‌ తీసుకోమాకు.. విత్‌డ్రా చేసుకో..

‘ఏంది గుంటూరు వెళ్లి రెంటచింతల జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశావంటా! నీవెమన్నా తోపుగాడివా? చెప్పాం గదా అన్ని ఏకగ్రీవాలవుతాయని! మళ్లీ మీరు వేయడం ఏంటి? రిస్క్‌ తీసుకోమాకు.. వెంటనే విత్‌ డ్రా చేసుకో! నీ ఇష్టం..’ ఇదీ జనసేన అభ్యర్థి రామకృష్ణకు వైసీపీ యువనేత ఒకరు ఫోన్‌లో చేసిన హెచ్చరిక. రామకృష్ణ నామినేషన్‌ ఉపసంహరణకు అంగీకరించడంతో జడ్పీటీసీ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానున్నట్టు తెలిసింది. అలాగే, తుమృకోట గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పోట్ల సతీష్‌, సాగునీటి సంఘాల మాజీ చైర్మన్‌ పోట్ల నరసింహారావు, రెంటచింతలకు చెందిన ఏరువ జోజిరెడ్డిల గృహాల్లో మద్యం సీసాలున్నాయని ఆరోపిస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్‌ వేయడానికి సాహసించలేదు. మల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత మౌలాలి నామినేషన్‌ వేసేందుకు రాగా, వైసీపీ యువనేత ఒకరు ఎందుకొచ్చావంటూ ఆయనపై పిడి గుద్దులు గుద్దారు. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-03-12T10:31:27+05:30 IST