నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం

ABN , First Publish Date - 2020-03-12T09:12:53+05:30 IST

కేంద్ర ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ప్రవర్తన నియమావళికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసిందని, ఇప్పటికే ఎన్నికల్లో దాన్ని అనుసరిస్తున్నామని

నామినేషన్‌ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం

  • సర్టిఫికెట్లు జారీచేయని వారిపై కఠిన చర్యలు: కమిషనర్‌

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ప్రవర్తన నియమావళికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసిందని, ఇప్పటికే ఎన్నికల్లో దాన్ని అనుసరిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక సీనియర్‌ అధికారులను నియమించామని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలు నిలుపుదలకు ఆదేశించామన్నారు. దీనిలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు చేసుకోవచ్చని చెప్పారు. కుల ధ్రువీకరణ, ఇతర పత్రాలు ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో జారీ చేయాలన్నారు. ఉద్దేశపూర్వకంగా సర్టిఫికెట్లు జారీచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకుని దాడి చేసిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సయ్యద్‌ బాషా, ఇమ్మాన్‌ బాషాను అరెస్టు చేశారన్నారు. పోలీసు, పరిపాలనా వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. నామినేషన్‌ వేయకుండా అడ్డుకునే ఘటనలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని డీజీపీకి సూచించామన్నారు. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. పోలీసులే మద్యాన్ని పొలాల్లో పెట్టి పొలం యాజమానిని అరెస్టు చేసినట్లు ఆరోపణలొచ్చాయని దానిపై వివరణ ఇవ్వాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని చెప్పారు. నిఘా యాప్‌ను స్వాగతిస్తున్నామని, ఈసీ చేపడుతున్న చర్యలకు అదనంగా యాప్‌ సేవలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగులను 10రోజుల్లోపు తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, సీఎస్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రంగులపై నిర్ణయిస్తాన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలతో ఏర్పాటు చేసుకున్న దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని, 15న మొదటి విడత, 17న రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. 

Updated Date - 2020-03-12T09:12:53+05:30 IST