‘ఎల్జీ’కి ఎన్‌వోసీ ఇవ్వలేదు

ABN , First Publish Date - 2020-06-04T09:24:47+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాల నిర్వహణ కోసం తాము ఆ సంస్థకు ఎలాంటి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇవ్వలేదని

‘ఎల్జీ’కి ఎన్‌వోసీ ఇవ్వలేదు

  • ఆ కంపెనీని మూసివేశాం.. 
  • డైరెక్టర్ల పాస్‌పోర్టులు సీజ్‌..
  •  రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌


అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాల నిర్వహణ కోసం తాము ఆ సంస్థకు ఎలాంటి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇవ్వలేదని స్పష్టం చేసింది. మార్చి 24న నిత్యావసరాల ఉత్పత్తులకు చెందిన పరిశ్రమల పునఃప్రారంభంపై నిర్వహణా మార్గదర్శకాలను మాత్రమే జారీచేశామని, అయితే పాలిస్టైరిన్‌, ఎక్స్‌పాండబుల్‌ పాలిస్టైరిన్‌, ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్‌లు వాటి పరిధిలోకి రావని పేర్కొంది. గతనెల 7న ఎల్జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీకై పలువురు మృతిచెందగా, ఈ ఘటనపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు కూడా ఈ ఘటనపై పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాణిజ్య, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. మూడోదశ లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు తమ సంస్థ కార్యకలాపాల నిర్వహణకు అనుమతి కావాలని కోరుతూ ఎల్జీ పాలిమర్స్‌ నిర్వాహకులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఆ పరిశ్రమ కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్‌లో లేదని డిక్లరేషన్‌ ఇవ్వాలని సూచించామని పేర్కొన్నారు. కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి డిక్లరేషన్‌ అందలేదని వివరించారు. 


ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ).. ఆ సంస్థ కార్యకలాపాలు, ఉత్పత్తులకు సంబంధించిన అనుమతిని ఉపసంహరించిందన్నారు. స్టైరిన్‌ వాయువు కాదు.. అది ఓ ద్రావణమని పేర్కొన్న కరికాలవలవన్‌.. ట్యాంకులో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో పాలిమరైజేషన్‌ రియాక్షన్‌ చెంది లీకైందని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఆ నివేదిక అందాక తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. మేఘాద్రిగడ్డ జలాల్లో స్టైరిన్‌ నమూనాలు లేవని స్పష్టమైందన్నారు. ఘటన జరిగిన తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి త్వరితగతిన నష్టనివారణ చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేశామని, కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌పైనా, దాని డైరెక్టర్లపైనా పోలీసులు కేసు నమోదు చేసి, 236మంది సాక్షులను విచారించారన్నారు. విషవాయువు లీకై 12 మంది మరణించగా, ఒక్కో కుటుంబానికి రూ.కోటి, తీవ్రంగా గాయపడి వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10లక్షలు, ఆస్పత్రుల్లో రెండుమూడు రోజులపాటు చికిత్స పొందిన 485మందికి తలా రూ.లక్ష, స్వల్పంగా గాయపడి చికిత్స పొందిన 99 మందికి తలా రూ.25వేలు, ఘటనతో ప్రభావితులైన 19,893మందికి తలా రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించామని వివరించారు.

Updated Date - 2020-06-04T09:24:47+05:30 IST