వైద్యం లేదని గెంటేశారు

ABN , First Publish Date - 2020-07-20T07:50:26+05:30 IST

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడమే కాదు... మానవ సంబంధాలను కాలరాస్తోంది.

వైద్యం లేదని గెంటేశారు

మెట్లమీదే పోయిన ప్రాణం

పిఠాపురంలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం


పిఠాపురం/ సత్తెనపల్లి, జూలై 19: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడమే కాదు... మానవ సంబంధాలను కాలరాస్తోంది. మరణించిన వ్యక్తిని చూసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు  ముందుకు రావడంలేదు. తోటి మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా స్పందించే హృదయాలు కరువవుతున్నాయనడానికి ఆదివారం వేర్వేరు ప్రాం తాల్లో జరిగిన ఘటనలే నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన బస్సా శ్రీమన్నారాయణ (60) 4 రోజులుగా మూత్ర సంబంధ వ్యాధి, జ్వరం తో బాధ పడుతున్నారు. ఆయనకు చికిత్స చేయించేందుకు భార్య పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే కరోనా భయంతో అక్కడి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. చేసేదిలేక ఆస్పత్రి మెట్లు దిగి వచ్చేసరికి శ్రీమన్నారాయణ కుప్పకూలా డు. మృతదేహాన్ని తరలించేందుకు 2గంటలు వేచి చూడాల్సి రావడంతో అక్కడ అతని భార్య కన్నీరు మున్నీరయ్యారు. ఎట్టకేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌ వచ్చినా మృతదేహాన్ని అందులోకి ఎక్కించేందుకు కూడా ఎవరూ ముందుకురాని దుస్థితి.


చివరకు అం బులెన్స్‌ డ్రైవర్‌, బంధువుల సాయంతో మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా నిర్థారణైం ది. మరోఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి(52)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కడానికి ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చాడు. ఆయాసంతో బాధపడుతూ రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు. వైరస్‌ భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ ముందుకు రాలేదు. 3గంటలకు పైగా మృతదేహం రోడ్డుపైనే ఉంది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-07-20T07:50:26+05:30 IST