డబుల్‌ రోడ్లపై టోల్‌ చార్జీలొద్దు

ABN , First Publish Date - 2020-11-21T09:09:46+05:30 IST

రాష్ట్రంలోని రెండు వరుసల రోడ్లపై టోల్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ లారీ ఓనర్స్‌ ..

డబుల్‌ రోడ్లపై టోల్‌ చార్జీలొద్దు

సీఎం జగన్‌కు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లేఖ 


విజయవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు వరుసల రోడ్లపై టోల్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, లాక్‌డౌన్‌తో అది మరింత అవసాన దశకు చేరుకుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోల్‌ వసూలు చేస్తే ప్రజలు, రైతులపైనే కాకుండా రవాణా రంగంపై తీవ్ర పెనుభారం తప్పదని తెలిపారు. మరోవైపు గడువు తీరినా నాలుగు వరుసల రహదారులపై టోల్‌ వసూళ్లు ఆగటం లేదన్నారు. ఏటా 10 నుంచి 15 శాతం మేర టోల్‌ చార్జీలను పెంపుదల చేయటం కూడా అన్యాయమన్నారు.  2005లో రవాణా(లారీ) రంగ సమస్యలపై స్పందించిన అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. తమ సంఘం అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని అన్ని వంతెనలపై టోల్‌ చార్జీలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Read more