2 నెలలుగా వేతనాల్లేవ్‌

ABN , First Publish Date - 2020-06-04T09:11:43+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో)లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న 240 మంది రాష్ట్ర, నగర సాంకేతిక సలహాదారులు 2 నెలలుగా వేతనాలందక అవస్థలు పడుతున్నారు.

2 నెలలుగా వేతనాల్లేవ్‌

  • ఏపీ టిడ్కో సాంకేతిక సలహాదారుల అవస్థలు
  • కేంద్రం వాటా విడుదలైనా.. దయ తలచని రాష్ట్ర ప్రభుత్వం!


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో)లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న 240 మంది రాష్ట్ర, నగర సాంకేతిక సలహాదారులు 2 నెలలుగా వేతనాలందక అవస్థలు పడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌(పీఎంఏవై-యూ) కింద పట్టణ గృహ నిర్మాణంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలవడంలో కీలకపాత్ర పోషించిన తమపై శీతకన్ను వేయడం తగదని వాపోతున్నారు. ఉన్నత విద్యార్హతలు, పలు ప్రభుత్వశాఖల్లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో టిడ్కోకు ఎంపికైన తమ కాంట్రాక్ట్‌ కాలపరిమితిని పీఎంఏవై-యూ కొనసాగనున్న 2022 వరకు ఇవ్వకుండా, 3 నెలలు మాత్రమే పొడిగించడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వేతనాలివ్వాలని, 2022 వరకు కాంట్రాక్ట్‌ను పొడిగించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పీఎంఏవై-యూ పథకంలో భాగంగా 2017 నవంబరులో వీరంతా ఏపీటిడ్కోలో సాంకేతిక సలహాదారులుగా ఎంపికయ్యారు. వీరిలో 11 మంది రాష్ట్రస్థాయి సలహాదారులు(ఎ్‌సఎల్‌టీసీ), మరో 229 మంది నగరస్థాయి సలహాదారులు(సీఎల్‌టీసీ). వీరికి చెల్లించే వేతనాల్లో 75 శాతాన్ని కేంద్రం, 25 శాతాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంది. కేంద్రం వాటాను ఇప్పటికే మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులను ఇవ్వనందున గత 2 నెలలుగా వీరికి వేతనాల్లేవు. వీరి కాంట్రాక్ట్‌ కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగియగా, 3 నెలల (ఈ నెలాఖరు వరకు) పొడిగింపునిచ్చారు. అందులో 2 నెలలకుపైగా లాక్‌డౌన్‌లోనే గడిచిపోయాయి. మరో 4 వారాల్లో వీరి కాంట్రాక్ట్‌ ముగిసిపోనుంది. ఇప్పటి వరకూ తాము అందించిన సేవలతోపాటు, తమలో పలువురికి ప్రభుత్వోద్యోగాలు సాధించేవయోపరిమితి మీరిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, పీఎంఏవై-యూ కొనసాగనున్న 2022 వరకు తమ కాంట్రాక్ట్‌లను పొడిగించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-06-04T09:11:43+05:30 IST