విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఘటనపై కేంద్రానికి ఎన్‌ఎస్‌జీ కీలక నివేదిక..

ABN , First Publish Date - 2020-03-02T08:46:54+05:30 IST

‘ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో స్థానిక పోలీసులు ఆయనకు కనీస రక్షణ కల్పించలేదు. భారీ ఎత్తున దూసుకు వచ్చిన నిరసన కారులను నిలువరించేందుకు...

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఘటనపై కేంద్రానికి ఎన్‌ఎస్‌జీ కీలక నివేదిక..

విశాఖ పోలీసులు చోద్యం చూశారు

బాబుకు కనీస రక్షణ  కల్పించలేదు

నిరసనకారులు దూసుకొచ్చినా పట్టించుకోలేదు

కోడిగుడ్లు, రాళ్లు విసిరినా నిర్లిప్తంగా ఉన్నారు

విశాఖ ఘటనపై కేంద్రానికి ఎన్‌ఎస్‌జీ నివేదిక!

ఫొటోలు, వీడియో ఆధారాలూ అందజేత


ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ సిటీ), మార్చి 1: ‘ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో స్థానిక పోలీసులు ఆయనకు కనీస రక్షణ కల్పించలేదు. భారీ ఎత్తున దూసుకు వచ్చిన నిరసన కారులను నిలువరించేందుకు కూడా ప్రయత్నించలేదు. కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరినా నిర్లిప్తంగా వ్యవహరించారు. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు కూడా చోద్యం చూశారు తప్పితే చర్యలు తీసుకోలేదు’ అని విశాఖ ఘటనపై చంద్రబాబు ఎన్‌ఎ్‌సజీ(నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌) బృందం కేంద్ర హోం శాఖకు నివేదిక పంపినట్టు తెలిసింది. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రతోపాటు విశాఖ శివార్లలోని పెందుర్తిలో అధికార పార్టీ నేతల భూకబ్జాలను పరిశీలించడానికి చంద్రబాబు గత గురువారం విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకు వెళ్లకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతోపాటు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు, టమాటాలు విసిరారు. సాయంత్రం వరకు చంద్రబాబు ఎయిర్‌ పోర్టులోనే ఉండిపోయారు. చంద్రబాబును అడ్డుకున్న వారిని నిలువరించడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించకుండానే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. భద్రత పరంగా జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు ఎన్‌ఎ్‌సజీ కమాండోలు రక్షణగా ఉంటారు. వీరికి అధికారిగా ఉన్న ఓ కమాండర్‌ విశాఖ ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్టు సమాచారం. వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్‌ని చుట్టుముట్టడం, స్థానిక పోలీసులు పట్టించుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వంటి దృశ్యాలను ఈ కమాండర్‌ వీడియో చిత్రీకరించారు. దీనిపై నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించినట్టు తెలిసింది.


Updated Date - 2020-03-02T08:46:54+05:30 IST