ఇళ్ల స్థలాల పంపిణీకి అనుమతి లేదు

ABN , First Publish Date - 2020-03-15T08:28:08+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అనుమతి లేదని...

ఇళ్ల స్థలాల పంపిణీకి అనుమతి లేదు

వలంటీర్లు ప్రచారం చేస్తే కోడ్‌ ఉల్లంఘనే!: ఎస్‌ఈసీ

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు. హైకోర్టులో ఇళ్ల స్థలాల పంపిణీని ఆపడానికి కొన్ని కేసులు దాఖలయ్యాయన్నారు. ఈ అంశాలన్నింటినీ గమనించి మోడల్‌ ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. స్థలాల పంపిణీకి సంబంధించి టెండర్లు పిలవడం, టోకెన్ల పంపిణీ తదితర కార్యక్రమాలన్నీ నిలిపివేశామని చెప్పారు. కాగా, గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ పార్టీల తరపున ప్రచారంలో పాల్గొనడాన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.


గ్రామ, వార్డు వలంటీర్లు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందున తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని అనుసరించాలన్నారు. వలంటీర్లు రాజకీయ పార్టీలకు సహకరిస్తున్నారని వివిధ పార్టీలు, ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వలంటీర్లు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఐటీ స్థాయి పోలీసు అధికారిని నియమించామని రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఐజీ కె.సత్యనారాయణను నియమించామన్నారు. ఆయన శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్‌ చేశారని తెలిపారు.

Updated Date - 2020-03-15T08:28:08+05:30 IST