కొత్త వైద్య కాలేజీలు లేనట్టే!

ABN , First Publish Date - 2020-03-04T09:01:01+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి...

కొత్త వైద్య కాలేజీలు లేనట్టే!

  • 15 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రతిపాదన
  • 12 కాలేజీలకు ఎంసీఐ అనుమతి డౌటే
  • మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రిలకే చాన్స్‌

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదనలు తయారు చేయిస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే తొలుత 7 కాలేజీలు నిర్మించాలని భావించారు. అనంతరం ఆ సంఖ్యను సీఎం జగన్‌ అనూహ్యంగా 15కు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రుల నిర్వహణే కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, నిర్వహణ వంటివి ఆరోగ్యశాఖకు తలకుమించిన భారంగా మారుతాయి. అయినా ఇవేమీ పట్టనట్లు ప్రభుత్వం 15 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ముందుకు వెళ్తోంది. వీటిలో ఏడు కాలేజీలకు రూ.2,450 కోట్లు అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇది కాకుండా ఏటా సిబ్బంది జీతాలకు రూ.900 కోట్ల కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. దీంతో కేంద్రం నుంచి నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని సీఎం సూచించారు. అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.

 

కేంద్రం ప్రకటన వెనుక..

ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండకూడదనే నిబంధన పెట్టింది. ఈ విషయం గమనించకుండానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్‌ కాలేజీల ప్రతిపాదనను తెచ్చింది. అయితే ప్రతిపాదిత ప్రాంతాల్లో మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల, మదనపల్లి తప్ప మిగిలిన వాటిలో ఒక్క దానికి కూడా కేంద్రం నిధులు వచ్చే అవకాశం లేదు. ఇక, అవకాశం ఉన్న 4 మెడికల్‌ కాలేజీల్లో మదనపల్లిలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో కేవలం 100 పడకలు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే సుమారు 200 పడకలు, 20 ఎకరాల స్థలం, ప్రతి రోజు 1000 ఓపీ ఉన్న అనుబంధ ఆసుపత్రి ఉండాలి..


రూ.8,200 కోట్లు అవసరం

15 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సుమారు రూ.8,200 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రానికి వీటి నిర్మాణం సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో పాడేరు, గురజాల ఆసుపత్రులను మెడికల్‌ కాలేజీలుగా మార్చేందుకు రూ.132 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇలా చిన్న మొత్తాలను విడుదల చేయడానికే ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం రూ.8,200 కోట్లతో కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడం కలగానే మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన 15 మెడికల్‌ కాలేజీలకు ఎంసీఐ అనుమతిచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు.  


బోధనాసుపత్రులది మరో బాధ

రాష్ట్రంలో ఉన్న 11 బోధనాసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. వీటికి అవసరమైన నిధులు విడుదల చేయడమే లేదు. బోధనాసుపత్రులు ప్రధానంగా హెచ్‌డీఎస్‌, ఆరోగ్యశ్రీ నిధులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో హెచ్‌డీఎస్‌కు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటోంది. ఆ ఖర్చును చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి భర్తీ చేసుకుంటాయి. అయితే, ఆరోగ్యశ్రీ నిధులను కూడా ట్రస్ట్‌ విడుదల చేయడం లేదు. ప్రతి ఆసుపత్రికి రూ.2 కోట్ల పైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయు. దీంతో బోధనాసుపత్రుల నిర్వహణ దయనీయంగా మారింది. 


ఏడుకే దిక్కులేదంటే.. 25

ఏపీ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం తమ నిబంధనల ప్రకారం ఒక్క కాలేజీకి కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. అయినా మరో 8 కాలేజీల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున 25 మెడికల్‌ కాలేజీలతో పాటు గిరిజన ప్రాంతంలో ఒక కాలేజీ నిర్మించాలని జగన్‌ నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు అనకాపల్లి, మదనపల్లి, రాజమండ్రి, హిందూపురం, నంద్యాల, నర్సాపూర్‌, బాపట్ల, అమలాపురం ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటికి  కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2020-03-04T09:01:01+05:30 IST