పర్యావరణ ప్రభావ మదింపు ఏదీ?
ABN , First Publish Date - 2020-05-09T10:21:05+05:30 IST
ప్రజల ప్రాణాలను నిలువునా తీసేసి.. ఎలా ఉన్నవారిని అలాగే తీవ్ర అస్వస్థతకు గురిచేసిన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీక్ వెనక అక్రమాలు, పొరపాట్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈఐఏ అనుమతి లేకుండా ఉత్పత్తి రెట్టింపా?
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలను నిలువునా తీసేసి.. ఎలా ఉన్నవారిని అలాగే తీవ్ర అస్వస్థతకు గురిచేసిన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీక్ వెనక అక్రమాలు, పొరపాట్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న సదరు కంపెనీని ఎన్నడో 1961లో స్థాపించారు. తర్వాత అది చేతులు మారి దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ కెమికల్స్ చేతికి వచ్చింది. ప్రముఖ ఎల్‌జీ గృహోపకరణాల కంపెనీకి సంబంధించిన శాఖే ఇది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం విశాఖలో ఈ కంపెనీ ప్రారంభించేనాటికి వెంకటాపురం ఎక్కడో దూరంగా ఉండేది. ఇప్పుడది విశాఖలో భాగమైపోయింది. అతి పెద్ద నగరంలో భాగమైన సదరు కంపెనీ తమ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అనుమతి ఇవ్వాలంటే.. పర్యావరణ ప్రభావ మదింపు (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసె్‌సమెంట్-ఈఐఏ) చేయాలి.
ఆ ఉత్పత్తిని రెట్టింపు చేయడం వల్ల పడే ప్రభావం.. దానిచుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చాయా.. లేదా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మదింపు జరగనే లేదని సమాచారం. దానికోసం సదరు కంపెనీ 2018లో అనుమతి అడిగినా ఇవ్వలేదు. 2019 మే నెలలో మళ్లీ లేఖ రాసింది. తమ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి ఈఐఏ అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ అనుమతి వచ్చేలోపు తాము డిక్లరేషన్ ఇస్తామని, రూ.4.5 లక్షల డిపాజిట్‌ను కూడా కడతామని తెలిపింది. కంపెనీ డిక్లరేషన్‌ను, డిపాజిట్ మొత్తాన్ని చూసి ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి ఆమోదం రాకుండానే ఇవ్వడంపై ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి దీనిపై విచారణ చేయాలని, నిజానిజాలు నిగ్గు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.