దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు: ఎన్నికల కమిషనర్ రమేష్

ABN , First Publish Date - 2020-03-16T01:07:05+05:30 IST

స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ నోట్‌ విడుదల చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు వాయిదా వేశామని ప్రకటించారు.

దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు: ఎన్నికల కమిషనర్ రమేష్

అమరావతి: స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ నోట్‌ విడుదల చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు వాయిదా వేశామని ప్రకటించారు. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిందని, కరోనాపై కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేసిందని తెలిపారు. జాతీయ స్థాయి సంస్థలను సంప్రదించాకే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని ప్రకటించారు. పరిస్థితి మెరుగైన మరుక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 


‘‘ఎన్నికల కోడ్‌ మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నాం. 6 వారాల్లోపే మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో హింసపై ఇప్పటికే పలు పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టులో వ్యాజ్యం ఉంది. హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఎస్‌ఈసీని చూడాలి. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థ. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశాం, రద్దు చేయలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు’’ అని రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-16T01:07:05+05:30 IST