వైసీపీ ప్రకటనలో నిజం లేదు: నిమ్మగడ్డ రమేష్
ABN , First Publish Date - 2020-10-28T21:08:33+05:30 IST
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్

విజయవాడ: స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయాలు తెలిపేందుకు 11 పార్టీలు హాజరైనట్లు తెలిపారు. రెండు పక్షాలు మాత్రం లిఖితపూర్వక సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ఆరు రాజకీయ పక్షాలు హాజరుకాలేదన్నారు.
కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా అమలు చేసినట్లు వివరించారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్లు చెప్పుకొచ్చారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్‌లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమమైందిగా భావించినట్లు చెప్పారు. సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్లు స్పష్టంచేశారు. సంప్రదింపు ప్రక్రియలో వచ్చిన ఏకాభిప్రాయాలను, అభిప్రాయాలను గౌరవించాలని కమిషన్ కోరుకుంటుందని నిమ్మగడ్డ తెలిపారు.