జడ్జిలను తిట్టిపోశారు

ABN , First Publish Date - 2020-08-01T09:37:48+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించడంతో న్యాయమూర్తులను అధికార పార్టీ నేతలు తీవ్రంగా దూషించారని

జడ్జిలను తిట్టిపోశారు

  • వ్యక్తిగతంగా, కులాల పేరిట దూషించారు ..
  • సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారు
  • స్పీకర్‌ నుంచి చీఫ్‌ విప్‌ వరకూ అందరిదీ అదే బాట 
  • సీఎం స్వయంగా దయలేని వ్యాఖ్యలు చేశారు
  • పదవి నుంచి తీసేస్తామని హెచ్చరించారు 
  • ఈ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు 
  • సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ అఫిడవిట్‌ దాఖలు 

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించడంతో న్యాయమూర్తులను అధికార పార్టీ నేతలు తీవ్రంగా దూషించారని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ నుంచి వైసీపీ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వరకూ అందరూ జడ్జిలను నానా దుర్భాషలాడారని, అనేకమంది సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకుంటోంది. కోర్టు హాళ్ల నుంచి న్యాయమూర్తులు పాలన సాగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో కోర్టులే నిర్ణయిస్తే ఎన్నికలెందుకు? ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రభుత్వ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి.


ఇది దారుణం’’ అని తమ్మినేని చేసిన వ్యాఖ్యల్ని రమేశ్‌కుమార్‌ ఆధారాలతో సహా సమర్పించారు. హిందూస్థాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఏఎన్‌ఐ, ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర మీడియాలో వచ్చిన క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు. న్యాయమూర్తులకు రమేశ్‌కుమార్‌ రూ.కోట్లు చెల్లించారంటూ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి అన్న మాటల్ని కూడా అఫిడవిట్‌లో ఉదహరించారు. హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన శుక్రవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావించిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు హైకోర్టుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను వ్యక్తిగతంగా, కులాలను ఆపాదించి కొందరు దూషించారు.


వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి, అడ్వకేట్‌ జనరల్‌కు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖలు రాశారు. అయినా అధికార వర్గాలు చర్యలు తీసుకోకపోవడంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, అవమానిస్తూ ధిక్కరణ పూర్వకంగా అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, వారి మద్దతుదార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు’’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎస్‌ఈసీని ఏపీ ప్రభుత్వం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుందని, దాని స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను హరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందనడానికి జూలై 21న జారీచేసిన రెండు జీవోలే నిదర్శనమన్నారు. ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చెల్లదని మే నెలలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఆయనకు ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ.6లక్షలు, అద్దె చెల్లింపులకు రూ.13.42లక్షలు మంజూరు చేస్తూ జీవోలు 418, 419 జారీ చేశారని వెల్లడించారు. న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లేకపోవడం దురదృష్టకమన్నారు.


వివిధ సామాజిక మాధ్యమాల నుంచి 

ఆయన తన అఫిడవిట్‌లో ఉటంకించిన వ్యాఖ్యలివీ...

అందర్నీ ఊచకోత కోయాలి. అందరు న్యాయమూర్తులను గదిలో బంధించి కరోనా సోకిన వ్యక్తిని విడుదల చేయాలి.   - చందూరెడ్డి

హైకోర్టు న్యాయమూర్తులకు కులతత్వం ఉన్నది.

-విజయ్‌తాతపూడి

అదొక పచ్చ హైకోర్టు. కోర్టులకు రాజకీయాలతో సంబంధం ఉన్నది                          

  - సిహెచ్‌. జాన్‌ బాబు

హైకోర్టు చంద్రబాబు అడ్డా.           

    - పంచ్‌ ప్రభాకర్‌ 

హైకోర్టులో మొత్తం మాఫియా బ్యాచ్‌ ఉంది.     

- చిన్ని వర్మ

అవినీతి పరులైన న్యాయమూర్తులుండడం సిగ్గుచేటు. మనం ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. న్యాయవ్యవస్థ పరిధులను దాటుతోంది అవినీతి న్యాయమూర్తుల నుంచి ఏమి ఆశించగలం? ఏపీ న్యాయమూర్తులు నార్కో పరీక్షలకు వెళ్లి తమ నిజాయితీ నిరూపించుకోవాలి.                           

       - లకీ్క్ష కిరణ్‌.బి

హైకోర్టు పచ్చ పార్టీకి కోవర్ట్‌గా మారింది 

    -డి.వి.ఎస్‌. కర్ణ

చంద్రబాబు, హైకోర్టు కుమ్మక్కయ్యాయనుకుంటా. ఎన్నో కేసుల్లో బాబు హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు.

  -రామకృష్ణ జోగి

ఇది హైకోర్టు కాదు, ఎవరిదో కార్యాలయం   

- నవీన్‌ కుమార్‌ 

ఇది హైకోర్టు కాదు తెలుగుదేశం కోర్టు   

- భాస్కర్‌ రెడ్డి1993

ఇది కమ్మ కులం కోర్టని నేను వందసార్లంటా 

 - రాజుయాదవ్‌ 

పుడ్‌ కోర్టు కేవలం పచ్చ తిండి మాత్రమే వండుతుందని మరోసారి రుజువైంది. ఇది వంటవాడికి సిగ్గుచేటు. ఈ ఫుడ్‌కోర్టు మాకసహ్యం.           

    - హరీశ్వర్‌ రెడ్డి ఎట్‌ ఆవ్‌సమ్‌ హరీశ్వర్‌ 

ఈ న్యాయమూర్తి తన విధేయతను చాటుకున్నారు 

- పిల్లా దుర్గా ప్రసాద్‌ 

హైకోర్టు ఎప్పుడూ టీడీపీతో అంటకాగుతుంది. ఇది టీడీపీ ఆఫీసు

- కౌరు దుర్గా నరేశ్‌ 

ఈ నిమ్మకాయ(నిమ్మగడ్డను)ను తిరిగి నియమించాలి. దీని రసం రుచిగా ఉంటుంది. మన రాష్ట్రంలో కోర్టులు ప్రజల కోర్టులా... కమ్మ కుల కోర్టులా? 


        -అనితారెడ్డి బుజ్జి

ఇది అనుకున్న తీర్పు మాత్రమే. మనకు తీర్పు రావాలంటే రెండే రెండు కావాలి. ఒకటి అమ్మాయిలు, రెండు డబ్బు 

- సుదర్శన్‌ ధంతిక

హైకోర్టు భవనంపై పచ్చజెండా ఎగురేయాలని, గోడలకు పచ్చరంగు వేయాలని, చంద్రబాబుకు కేబిన్‌ నిర్మించాలని పిల్‌ దాఖలు చేస్తున్నట్లు తెలిసింది. తీర్పులు కూడా చంద్రబాబే రాయాలట 

- జయదీప్‌ మన్యు

బాబు బ్యాచ్‌ వల్లే న్యాయవ్యవస్థ నాశనమైంది. కొందరు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకే కళంకం.       

       - టీవీఎస్‌ రెడ్డి

ఎస్‌ఈసీ కమ్మగడ్డను తిరిగి నియమించమని ఆదేశించారు

- సూర్యా రెడ్డి రాగుల ఎట్‌ సూర్యారెడ్డి వైసీపీ

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించాల్సిన విషయాన్ని నిర్ణయిస్తున్న అసహ్యమైన క్రిములపై సుప్రీంకు వెళతాము.                 

                     -కేసగిరి మాధవి

Updated Date - 2020-08-01T09:37:48+05:30 IST