‘కాళేశ్వరం’లో ఉల్లంఘనే

ABN , First Publish Date - 2020-10-21T08:53:16+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు జరిగాయని

‘కాళేశ్వరం’లో ఉల్లంఘనే

పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు..

ముందస్తు అనుమతుల్లేకుండానే నిర్మాణం

తాగునీటి ప్రాజెక్టు అన్న తెలంగాణ వాదనను అంగీకరించం: ఎన్‌జీటీ 


న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడంలో నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టినందుకు పర్యావరణానికి హాని జరిగిందని తేల్చింది. ‘‘పర్యావరణ అనుమతులు తీసుకోవడంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది కాబట్టి కేవలం పునరుద్ధరణ చర్యలు, భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఇక్కడ ప్రధాన అంశం’’ అని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్రమంగా పర్యావరణ అనుమతులు తీసుకున్నారంటూ హయాతుద్దీన్‌, మూడో టీఎంసీ విస్తరణ పనులకు అనుమతులు లేవంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ఎన్‌జీటీ విచారించింది. చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యుడు జస్టిస్‌ ఎస్పీ వాంగ్డీ, సభ్య నిపుణుడు నాగిన్‌ నందాల త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించింది.


ప్రాజెక్టు ముందస్తు పర్యావరణ అనుమతుల్లో జరిగిన ఉల్లంఘనలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ, ఉపశమన చర్యలపై అధ్యయనానికి ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నెల రోజుల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. కమిటీ ఆరు నెలల్లో అధ్యయనాన్ని పూర్తి చేయాలని సూచించింది. 


మూడో టీఎంసీపై.. 

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణ పనులకు సం బంధించి కేంద్రం ఆదేశాలను పాటించాల్సిందేనని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. రోజుకు 2 టీఎంసీల బదులు 3 టీఎంసీల నీటిని తోడుకోవడానికి చేపడుతున్న ఈ విస్తరణలో మౌలిక మార్పులు లేవు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. ఎక్కువ నీళ్లు తోడుకున్నప్పుడు ఎక్కువ నిల్వ సామర్థ్యం అవసరమవుతుందని, ఇది గోదావరి నదిపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.


గోదావరి బోర్డుకు డీపీఆర్‌లు అందించకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ముందుకెళ్లవద్దని సీఎంకు కేంద్ర మంత్రి లేఖ రాశారని.. తమకు ప్రతిపాదనలు అందలేదని కేంద్ర జల సంఘం కూడా స్పష్టం చేసిందని గుర్తుచేసింది. ఈ నెల 2న సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను కేంద్ర జలశక్తి శాఖ పరిశీలించాలని, ఆ శాఖ నిర్ణయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని సూచించింది. ప్రాథమికంగా కాళేశ్వరం తాగునీటి సరఫరా, జల నిర్వహణ ప్రాజెక్టు కాబట్టి 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల అవసరం రాలేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తాము అంగీకరించలేకపోతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2020-10-21T08:53:16+05:30 IST