కొత్త చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లు: వడ్డే

ABN , First Publish Date - 2020-12-28T09:06:03+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లుగా మారతాయని ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లు: వడ్డే

సింఘు వెళ్లి రైతులకు సంఘీభావం 

10 లక్షల ఆర్థిక సాయం అందజేత


న్యూఢిల్లీ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాళ్లుగా మారతాయని ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘులో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, ఏపీలోని రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య తదితరులతో కలిసి వడ్డే  సింఘు ప్రాంతానికి వెళ్లారు. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ నేత హన్నన్‌ మొల్లాకు రూ.10 లక్షల సాయం అందించారు. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ.. వణికిస్తున్న చలిలో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారని, కనీసం జాలి, మానవత్వం లేకుండా ఉద్యమాన్ని మోదీ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. రైతులను సంప్రదించి చట్టాలు తెచ్చామంటూ మోదీ అబద్ధం చెబుతున్నారన్నారు. కరోనా లాక్‌డౌన్‌ని ఆసరాగా తీసుకొని ప్రధాని కేవలం కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేసేలా కొత్త చట్టాలను తీసుకువచ్చారని దుయ్యబట్టారు. వడ్డే మద్దతుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-28T09:06:03+05:30 IST