నేనా వ్యాఖ్యలు చేయలేదు
ABN , First Publish Date - 2020-12-29T07:54:56+05:30 IST
‘రాష్ట్రంలో రాజ్యాంగవ్యవస్థలు కుప్పకూలాయి, పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తాం’ అని తాను అనలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పష్టం చేశారు.
- రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు.. కుప్పకూలాయనలేదు
- పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామనీ చెప్పలేదు
- జడ్జిలు వస్తారు.. పోతారు.. ఎప్పటికీ నిలిచేది న్యాయవ్యవస్థే
- పౌరహక్కుల రక్షణ న్యాయమూర్తుల బాధ్యత
- వారికి వ్యక్తిగతం ఏముంటుంది?: జస్టిస్ రాకేశ్‌కుమార్
- విచారణ నుంచి వైదొలగాలన్న పిటిషన్‌పై తీర్పు వాయిదా
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రాజ్యాంగవ్యవస్థలు కుప్పకూలాయి, పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తాం’ అని తాను అనలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్వచ్ఛందంగా వైదొలగాలని ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగియడంతో.. తీర్పును వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ‘న్యాయమూర్తులు వస్తుంటారు.. పోతుంటారు.
న్యాయవ్యవస్థే ఎప్పటికీ నిలిచి ఉండేది. దానిని ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పౌరుల హక్కులను హరించేలా చట్టాలు చేయకూడదని రాజ్యాంగంలోని 13వ అధికరణ స్పష్టం చేస్తోంది. న్యాయమూర్తులుగా మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంది. ఇందులో మాకు వ్యక్తిగతం ఏముంటుంది? ఏదేమైనా కెరీర్ చివరిదశలో నిష్పాక్షికంగాలేననే ఆరోపణలు ఎదుర్కొంటున్నాను’ అని జస్టిస్ రాకేశ్‌కుమార్ మరోసారి ఆవేదన వ్యక్తంచేశారు.
హోరాహోరీ వాదనలు..
వాస్తవానికి మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలను వేలం వేయతలపెట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ పలువురు వేసిన పిటిషన్లపై ఈ నెల 11వ తేదీన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ‘రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం ఎలా వేస్తుంది. ఆస్తుల వేలం వేయడాని ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తాం. పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామని జస్టిస్ రాకేశ్‌కుమార్.. పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణ నుంచి తప్పుకోవాలి’ అని కోరుతూ మిషన్ బిల్డ్ ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. స్థలాల వేలాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం ఎలా వేస్తుంది.. వేలం వేయడాని ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా అని వ్యాఖ్యానించింది నిజమే.. కానీ రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలు కుప్పకూలాయి.. పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామని అనలేదు’ అని తేల్చిచెప్పారు.
న్యాయమూర్తికి ఆపాదిస్తారా?
ఈ వ్యవహారంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల జోక్యంపై అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయవాది డీఎ్‌సఎన్వీ ప్రసాద్‌బాబు ఆక్షేపించారు. అందరినీ బజారుకీడ్చే విధంగా ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏఏజీ అనుమతించారని, న్యాయమూర్తులపై ఆరోపణలు ఆపాదించారని పేర్కొన్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి.. న్యాయమూర్తిపై ఇలాంటి వ్యాఖ్యలు ఆపాదించడం సరికాదని.. న్యాయవ్యవస్థలోకి ఎలా చొచ్చుకువస్తారని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండా ఐఏఎస్ అధికారిని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగే విచారణలోకి ఏఏజీ అనుమతించారని వ్యాఖ్యానించారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ.. దయచేసి వాదులాడుకోవద్దని, ఇప్పటికే తాను బాధను అనుభవిస్తున్నానన్నారు. ఆ వ్యాఖ్యలు తన నోటి నుంచి వచ్చాయోలేదో చెప్పేఅధికారం పిటిషనర్ల తరఫు న్యాయవాదులుగా వారికి ఉందని చెప్పారు. ఏఏజీ బదులిస్తూ.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
సత్యం, ధర్మం అణచివేతకు గురవుతున్నప్పుడు.. అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఉండీ మౌనంగా ఉండడం సరికాదంటూ మహాభారతంలోని శ్లోకాలను ప్రస్తావించారు. ప్రసాద్‌బాబు స్పందిస్తూ.. ఏఏజీ చెప్పేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ‘నన్ను దయ్యంగా పిలుస్తారా? ఎంత ధైర్యం’ అంటూ ఏఏజీ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ దశలో జస్టిస్ రమేశ్ స్పందిస్తూ.. రిక్విజేషన్ పిటిషన్లపై విచారణ జరుగుతున్నందున ఇతరులెవరూ కలగజేసుకోవద్దని, అనుబంధ పిటిషన్ వేసినవారు వాదనలు వినిపించాలని పేర్కొన్నారు. ఏఏజీ స్పందిస్తూ.. తనను దయ్యం అనడానికి ఎంత ధైర్యమని వ్యాఖ్యానించగా.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది కేఎస్ మూర్తి కోరారు. అనిపించుకున్న వారికి ఆ బాధ ఉంటుందని ఏఏజీ అన్నారు.
ఆ వ్యాఖ్యలు ఎక్కడున్నాయి?
ఈ సమయంలో జస్టిస్ రాకేశ్‌కుమార్ జోక్యం చేసుకుని.. పిటిషనర్ ప్రవీణ్‌కుమార్ తాను కోర్టులో లాగిన్ అయి విచారణను గమనించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారని, కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారా అని ఏఏజీని ప్రశ్నించారు. కోర్టు వెబ్‌సైట్‌లో ఆ వివరాలు పొందారని ఆయన బదులిచ్చారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్నారు కాబట్టి ఆయన అనధికారికంగా లాగిన్ అయినట్లు పరిగణించకూడదన్నారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు మరుక్షణమే ఏబీఎన్ టెలివిజన్‌లో స్ర్కోల్ అయ్యాయని.. తర్వాతి రోజు పత్రికలో కూడా ప్రచురించారని.. వారు అనధికారికంగా విచారణలో యాక్సెస్ అయ్యారని తెలిపారు. న్యాయమూర్తి ఆ వ్యాఖ్యలు చేసినట్లు తాము విన్నామని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పత్రికలో ప్రచురిస్తే ఎక్కడ ఉన్నాయో చూపించాలని కోరింది. అఫిడవిట్‌లో పొందుపరచిన కొన్ని వ్యాఖ్యలు తాను చేయలేదని జస్టిస్ రాకేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. తనసహచర న్యాయమూర్తి, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కూడా ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలతో విభేదిస్తున్నారని గుర్తుచేశారు. రికార్డుల్లో కూడా ఆ వ్యాఖ్యలు కనిపించడం లేదన్నారు.
పిటిషనర్ల తరఫు ఇంకో న్యాయవాది నళినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఏ పత్రికలోనూ ప్రచురించలేదన్నారు. కేసులు ధర్మాసనం ముందు విచారణకు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పిటిషన్ వేసిందని ఆరోపించారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ కలగజేసుకుంటూ.. హెబియస్ కార్పస్ పిటిషన్లలో.. రాజ్యంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చేందుకు వాదనలపరంగా సహకారం అందించాలని మాత్రమే పిటిషనర్లను కోరానని గుర్తుచేశారు. వాదనల అనంతరం తీర్పును ధర్మాసనం వాయిదావేసింది.
నేను ఆ వ్యాఖ్యలు చేసినట్లు కేవలం మీరు, పిటిషనర్ మాత్రమే చెబుతున్నారు. రికార్డుల్లో కూడా ఆ వ్యాఖ్యలు కనిపించడం లేదు. చేశానో లేదో దేవుడు మాత్రమే తేల్చాలి.
- జస్టిస్ రాకేశ్‌కుమార్