పోలీసుస్టేషన్‌లో శిరోముండనం

ABN , First Publish Date - 2020-07-22T07:28:29+05:30 IST

బడుగులకు కష్టంవస్తే, భరోసాగా నిలవాల్సిన పోలీసులే కక్షకట్టినట్టు వ్యవహరించారు.

పోలీసుస్టేషన్‌లో  శిరోముండనం

దళితుడిపై పోలీసుల అమానుషం

అధికార నేత కన్నెర్రకు ఖాకీ సాయం

సీతానగరం పోలీసుస్టేషన్‌లో ఘటన

ఎస్సై అరెస్టు.. ఇద్దరు పోలీసులు సస్పెండ్‌

ఆ ముగ్గురిపై అట్రాసిటీ చట్టం కింద కేసు

‘తూర్పు’లోని సీతానగరం స్టేషన్‌లో ఘటన 

ఎస్సై, ఇద్దరు పోలీసులపై అట్రాసిటీ కేసులు


రాజమహేంద్రవరం, అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : బడుగులకు కష్టంవస్తే, భరోసాగా నిలవాల్సిన పోలీసులే కక్షకట్టినట్టు వ్యవహరించారు. అధికార నేతకు, స్థానిక దళిత యువకుడికి మధ్య వచ్చిన గొడవలో... ‘మేం అధికారంలో ఉన్నాం. మామీదే తిరగబడతాడా? వాడికి గుండు కొట్టించి, ఊరంతా తిప్పుతాను’ అని ఆ నేత అధికార దర్పం ప్రదర్శించుకొంటే.. పోలీసులు అన్నంత పనీ చేశారు. క్షురకుడిని పిలిపించి ఆయన అన్నట్టే బాధితుడి తల వెంట్రుకలు తీయించి, మీసాలు కత్తిరించి శిరోముండనం చేయించారు. సాక్షాత్తూ పోలీ్‌సస్టేషనే ఈ దుర్మార్గానికి వేదికగా మారడం దారుణం! ‘ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే పోలీసులు ఉండాలి.. ప్రజలకు యూనిఫారం జవాబుదారీ కావాలి’ అని ఓ కేసులో రాష్ట్ర హైకోర్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి క్లాస్‌ పీకిన రోజే, అదే జిల్లాలో ఈ ఘటన జరిగింది.


బాధితుడి కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని కనకదుర్గ గుడి రోడ్డు మీద గత శనివారం రాత్రి 10గం.ల సమయంలో ఓ ఇసుక లారీ ఓ దళిత యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు గాయమైంది. గాయపడిన యువకుడిని తరలించడానికి తక్కిన దళిత యువకులు ప్రయత్నించారు. ఆ సమయంలో కారులో అటువచ్చిన అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత కవల కృష్ణమూర్తి హారన్‌ కొట్టారు. హారన్‌ కొట్టొద్దు, కాసేపు ఆగమని ఆయనకు దళిత యువకులు చెప్పారు. అయినా కృష్ణమూర్తి అదే పనిగా హారన్‌ కొడుతుండటంతో.. ఇండుగుమిల్లి ప్రసాద్‌ అనే యువకుడు ఆ కారు పక్కకు వెళ్లారు.


అదే సమయంలో కృష్ణమూర్తి డోర్‌ తీయడంతో ప్రసాద్‌కు గాయమైంది. దీనిపై ఆగ్రహించిన ప్రసాద్‌.. కారు అద్దాలు పగులగొట్టారు. ఈలోపు కృష్ణమూర్తి తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆయన బంధువులు అక్కడకు చేరుకొన్నారు. గుమిగూడిన దళిత యువకులతో వారంతా వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ మూడుగంటలు సాగింది. ఆ తర్వాత పెద్దల జోక్యంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. కవల కృష్ణమూర్తి ఈ ఘటనపై సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ దళితులు, వారి ఇళ్లలోని ఆడవాళ్లు వెళ్లి కృష్ణమూర్తి, అతని సోదరుడు దుర్గాప్రసాద్‌ని కలిశారు. ‘మావాడేమైనా తప్పు చేసి ఉంటే, కాళ్లు పట్టుకుంటాం. కేసుల జోలికి వెళ్లకండి. మేం పేదోళ్లం’’ అని బతిమిలాడారు. అయినా, వివాదం కొలిక్కి రాలేదు. వైసీపీలో చురుగ్గా ఉండే కృష్ణమూర్తి కొందరితో మాట్లాడుతూ... ‘‘వాడు ఊళ్లో ఎలా తిరుగుతాడో చూస్తాను. మేం అధికారంలో ఉన్నాం. మామీదే తిరగబడతాడా? వాడికి గుండు కొట్టించి, ఊరంతా తిప్పుతాను’’ అని చెప్పినట్టు బాధితులు చెబుతున్నారు. ఇంట్లోంచే కొట్టుకొంటూ స్టేషన్‌కు..

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీతానగరం ఇన్‌చార్జి ఎస్‌ఐ షేక్‌ ఫిరోజ్‌షా తన సిబ్బందితో మునికూడలిలోని ప్రసాద్‌ ఇంటికి వెళ్లారు. ఇంట్లోంచి ప్రసాద్‌ను బాదుకుంటూ పోలీ్‌సస్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ మరోసారి చిదకబాదారు. ‘కాసేపటిలో నిన్నేమి చేస్తానో చూడు’ అంటూ ప్రసాద్‌ను భయభ్రాంతులకు ఎస్సై గురిచేశారు. క్షురకుడిని సాయంకాలం ఐదు గంటల సమయంలో పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై దగ్గరుండి  ప్రసాద్‌కు శిరోముండనం చేయించారు. ప్రసాద్‌ కోసం స్టేషన్‌కు వచ్చిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి తల్లడిల్లిపోయింది. గుండెలు బాదుకుంటూ.. జరిగిన ఘటనపై బంధువులకు సమాచారం అందించింది.


వారంతా పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకొన్నారు. చివరకు మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ప్రసాద్‌ను అతని తల్లి, బంధువులతో పంపించేశారు. ఇంటి దగ్గర, స్టేషన్‌లో బాగా కొట్టడంతో ప్రసాద్‌ నడవలేని స్థితికి చేరుకొన్నారు. పంపించే ముందు ప్రసాద్‌ వద్ద సీఐ వాంగ్మూలం సేకరించారు. శిరోముండనం వ్యవహారం వివాదంగా మారడంతో మంగళవారం డీఎస్పీ, సీఐ తదితరులు ప్రసాద్‌ ఇంటికి వెళ్లి.. మళ్లీ వాంగ్మూలం తీసుకున్నారు. ప్రసాద్‌ను వైద్యం కోసం బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తెచ్చారు. అయితే, కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చినందున తాము జనరల్‌ కేసులను చూడటం లేదని చెప్పి సిబ్బంది వారిని వెనక్కి పంపించేశారు.


ఆ తర్వాత కొందరి సహకారంతో రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌, తదితరులతో కలసి బాధితుడు ప్రసాద్‌, అతని తల్లి సత్యవతి తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. ‘‘వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి ప్రోద్బలంతోనే పోలీసులు నన్ను తీవ్రంగా హింసించారు. ఘర్షణ సమయంలో కృష్ణమూర్తి నన్ను కులం పేరుతో దూషించారు. ‘నిన్ను వదలను. మా వైసీపీ అధికారంలో ఉంది. నీకు గుండు కొట్టించి ఊరంతా తిప్పుతా. ఎలా బతుకుతావో చూస్తాను’ అని హెచ్చరించారు. పోలీ్‌సస్టేషన్‌లో వీపు మీద, రెండు కాళ్లు విడదీసి కాళ్లమీద, వెనుక వైపు తీవ్రంగా కొడుతూ.. ఎస్సై సైతం నన్ను కులం పేరుతో దూషించారు. ‘నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో తెలుసా...’ అంటూ తీవ్రంగా కొట్టారు. ఒకదశలో చంపేసే ప్రయత్నం చేశారు’’ అని ప్రసాద్‌ వాపోయారు. తాను స్టేషన్‌కు వెళ్లకపోతే తన కుమారుడు ప్రసాద్‌ను పోలీసులు చంపేసేవార తల్లి ఇండుగుమిల్లి ఽసత్యవతి కన్నీరు పెట్టుకొన్నారు. 


బాధితుల వద్దకు నేడు టీడీపీ బృందం

తూర్పుగోదావరి జిల్లాలో దళిత బాలిక, యువకుడిపై జరిగిన దుర్మార్గాలను విచారించేందుకు టీడీపీ అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. సీతానగరంలో శిరోముండనం జరిగిన బాధితుడిని, రాజమండ్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని  బుధవారం కమిటీ పరామర్శిస్తుంది. ఈ కమిటీలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఎస్‌ జవహర్‌, పీతల సుజాత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, నేతలు హరీశ్‌ మాధుర్‌, దళిత నేతలు మోకా ఆనందసాగర్‌, దాసరి ఆంజనేయులు ఉన్నారు. కాగా,  దళిత యువకుడికి శిరోముండనం చేయడం అమానుషమని నరసాపురం వైసీసీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇసుక మాఫియా కోణం ఉందా?

శిరోముండనం ఘటనలో ఇసుక మాఫియా కోణమూ పనిచేసినట్టు తెలుస్తోంది. అక్రమ ఇసుకను పట్టిస్తే రూ. 50వేలు ఇస్తానని ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రకటించారు. అప్పటినుంచి స్థానిక దళిత యువకులు ఆ ప్రయత్నంలో ఉండటంతో.. ఇసుక ర్యాంప్‌ల వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఘటనకు ఇది కూడా నేపథ్యంగా పని చేసి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. 


సీఎం సీరియస్‌

బాధ్యులపై చర్యలకు డీజీపీకి ఆదేశం

దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనలో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. సీఎంవో వర్గాల సమాచారం మేరకు,  ఈ ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధ్యులైన పోలీసు సిబ్బందిపై వెంటనే చర్య తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చోటు చేసుకోరాదని స్పష్టం చేశారు. ఆ వెంటనే డీజీపీ గౌతం సవాంగ్‌ స్పందించారు. ప్రాథమిక విచారణ జరిపి... ఎస్సై షేక్‌ ఫిరోజ్‌షా అరెస్టునకు ఆదేశించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఈ ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్‌ నంబర్‌ 257/20, యు/ఎస్‌ 324,323,506, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ తదితర సెక్షన్లూ వారిపై నమోదు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ షెముషి బాజ్‌పాయ్‌ తెలిపారు. కాగా, వైసీపీ నేత కృష్ణమూర్తి తదితరులపై బాధితుడు ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం ఘటన జరగడం ఇది రెండోసారి.


బాధ్యులందరినీ జైలుకు పంపిస్తాం

బాధితుడ్ని ఆదుకుంటాం : మంత్రి విశ్వరూప్‌


రాజమహేంద్రవరం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, వారిని ప్రోత్సహించినట్టు చెబుతున్న కృష్ణమూర్తి అనే వ్యక్తిపై  ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ను మంగళవారం రాత్రి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, శిరోముండనానికి గురైన ప్రసాద్‌ను, ఇటీవల అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించడానికి బుధవారం టీడీపీ దళిత నాయకుల బృందం రాజమహేంద్రవరం రానుంది. శిరోముండనం కేసులో సీనియర్‌ డీఎస్పీని విచారణాధికారిగా నియమించినట్టు ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు. అవసరమైతే బాధితుడికి పోలీస్‌ రక్షణ కల్పిస్తామని చెప్పారు.


పథకం ప్రకారం దళితులపై దాడులు: హర్షకుమార్‌రాజమహేంద్రవరం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ‘పోలీసు స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం చేయడం దారుణం. 24 గంటలు టైం ఇస్తున్నాను. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, జైలుకు పంపించాలి. ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తే సరిపోదు. సీఐ, డీఎస్పీ, ఎస్పీలను కూడా సస్పెండ్‌ చేయాలి’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా? ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, మంత్రులు ఉన్నారు. దళితులలో పెయిడ్‌ బ్యాచ్‌కు సవాల్‌ చేస్తున్నాను. మీకు సిగ్గు ఉంటే, ఇదే కులంలో పుట్టి ఉంటే ఖండించండి. పార్టీ ముసుగులు వదలండి. స్పందించండ’ని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-07-22T07:28:29+05:30 IST