అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: నారాయణ

ABN , First Publish Date - 2020-09-29T21:57:37+05:30 IST

ప్రధాని మోదీ కాళ్లను జగన్, చంద్రబాబు, పవన్ పట్టుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: నారాయణ

విశాఖ: ప్రధాని మోదీ కాళ్లను జగన్, చంద్రబాబు, పవన్ పట్టుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. బీజేపీని వ్యతిరేకిస్తే జైలుకు పోతానని జగన్ భయపడుతున్నారని, ఏపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుగా మారిపోయిందని విమర్శించారు. రాజధానిపై తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. అమరావతే ఏపీ రాజధాని అని, ఇందులో మార్పు లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు నిరసన దీక్ష చేపట్టాయి. 


ఈ సందర్భంగా నారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వ్యవసాయ చట్టం ప్రజా వ్యతిరేకగా ఉందని, ఈ బిల్లు రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనదని.. అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాగే విద్యుత్ బిల్లు పెట్టి రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని విమర్శించారు. కార్పొరేటు కంపెనీలకు కొమ్ము కాస్తోందని, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దివాళకోరు రాజకీయాలు చేస్తున్నాయని నారాయణ మండిపడ్డారు.

Updated Date - 2020-09-29T21:57:37+05:30 IST