నడిరోడ్డుపై ఎంవీఐ దందా

ABN , First Publish Date - 2020-11-07T09:51:57+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జాతీయ రహదారిపై రవాణా శాఖ, వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తోంది.

నడిరోడ్డుపై ఎంవీఐ దందా

విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జాతీయ రహదారిపై రవాణా శాఖ, వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తోంది. వచ్చేపోయే వాహనాలను ఆ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు ఆపుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించారని గమనించిన వాహనాల కాగితాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని రహదారి పక్కనే కారులో కూర్చున్న మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ మృత్యుంజయ రాజుకు పంపిస్తున్నారు. తన వద్దకు వచ్చిన వాహనదారులకు నిబంధనల ఉల్లంఘనలకు భారీగా ఫైను వేయాల్సి ఉంటుందని చెపుతూ వారిని బెదిరించారు. బెంబేలెత్తిన డ్రైవర్లు ఆయనకు అడిగినంత సమర్పించుకుని వాహన పత్రాలను తీసుకుని వెళ్తున్నారు. పట్టపగలు, నిస్సిగ్గుగా, నిర్భీతీగా సాగుతున్న ఈ దందా మొత్తాన్ని ఓ బాధితుడు రహస్యంగా చిత్రీకరించాడు. పలువురి వద్ద నుంచి సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఎంవీఐ ఈ.మృత్యుంజయ రాజు డబ్బులు వసూలు చేస్తున్నట్లు విస్పష్టంగా కనిపించింది. ఆ వీడియోను సదరు బాధితుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్‌ అయ్యింది. చివరికి రవాణా శాఖ అధికారులకు చేరింది. దీంతో ఎంవీఐని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-11-07T09:51:57+05:30 IST