గ్రేహౌండ్స్ చీఫ్‌గా మీనా
ABN , First Publish Date - 2020-10-14T08:25:38+05:30 IST
మావోయిస్టుల ఏరివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న గ్రేహౌండ్స్ చీఫ్ పోస్టును...

- గుంటూరు రేంజ్‌కు త్రివిక్రమ్ వర్మ..
- ఏపీఎస్పీ ఐజీగా శంకబ్రత బాగ్చి
- హోం ప్రత్యేక కార్యదర్శిగా విజయకుమార్
- సుధీర్‌కుమార్‌రెడ్డి విజిలెన్స్‌కు
- రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎ్‌సల బదిలీ
- ఏబీ, మాదిరెడ్డికి దక్కని పోస్టింగ్
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ఏరివేతకు పొరుగు రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న గ్రేహౌండ్స్ చీఫ్ పోస్టును భర్తీ చేసింది. గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్న అదనపు డీజీ ఆర్.కే.మీనాను గ్రేహౌండ్స్‌తోపాటు ఆక్టోపస్ ఏడీజీ పోస్టులో నియమించింది. డీఐజీ త్రివిక్రమ్ వర్మకు గుంటూరు రేంజ్ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ముందు ఏలూరు రేంజ్ డీఐజీగా పనిచేసిన ఆయన్ను జగన్ ప్రభుత్వం సీఐడీలో ప్రాధాన్యం లేకుండా కూర్చోబెట్టింది. దీంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ నుంచి ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మార్గం సుగమమైందని ప్రచారం జరిగింది. అయితే మూడు నెలలకు పైగా నిరీక్షణ తర్వాత ఐజీ ర్యాంకు అధికారి పోస్టులో డీఐజీ త్రివిక్రమ్‌ను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న శంకబ్రత బాగ్చి ఏపీఎస్పీ ఐజీగా బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ్‌కుమార్‌ను హోం శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డిని విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా నియమించారు. కీలకమైన ఈ విభాగానికి అధిపతిగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని గతంలో ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేసిన వైసీపీ సర్కారు.. అదనంగా విజిలెన్స్ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే ఏడాది కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీజీ ర్యాంకు అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు, ఇటీవలే ఆర్టీసీ నుంచి బదిలీ అయిన అదనపు డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతా్‌పకు బదిలీల్లో మొండిచేయి చూపింది. వారికి ఎలాంటి పోస్టింగూ ఇవ్వలేదు.
పోస్టుల స్థాయి కుదింపు..
రాష్ట్ర పోలీసు శాఖలో పోస్టులు ఒక్కొక్కటిగా స్థాయి తగ్గుతూ వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యాన్ని బాగా తగ్గించి వేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేసి ఏకంగా అదనపు డీజీ ర్యాంకు అధికారిని కమిషనర్‌గా నియమించింది. ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం కొన్నాళ్లపాటు ద్వారకాతిరుమలరావును కొనసాగించినా.. ఆ తర్వాత ఆయన స్థానంలో ఐజీ ర్యాంకు అధికారి బి.శ్రీనివాసులును నియమించి ఒకేసారి కమిషనరేట్ హోదాను రెండు మెట్లు కిందికి దించింది. అలాగే అమరావతి ప్రాంతం ఉన్న గుంటూరు రేంజ్‌కు ఐజీ ర్యాంకు అధికారిని నియమించాల్సి ఉండగా.. డీఐజీ ర్యాంకు అధికారి త్రివిక్రమ్ వర్మను నియమించింది. గతంలో గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజిలాల్‌ను ఎస్‌ఈబీకి బదిలీచేసి.. ఆయన స్థానంలో ఐజీ ర్యాంకు అధికారి జె.ప్రభాకరరావును నియమించింది.