దళిత ఎంపీడీవోపై వేటు

ABN , First Publish Date - 2020-06-19T09:48:27+05:30 IST

రాష్ట్రంలో దళిత అధికారులపై వేధింపుల పర్వం పరాకాష్ఠకు చేరుతోంది. డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అనితారాణి, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ ..

దళిత ఎంపీడీవోపై వేటు

స్థానిక ఎన్నికల  ప్రక్రియలో పొరపాట్లు చేశారంటూ అభియోగం

అవి తేలేదాకా సరెండర్‌కు ఆదేశం

మండిపడుతున్న దళిత సంఘాలు 


టంగుటూరు, జూన్‌ 18: రాష్ట్రంలో దళిత అధికారులపై వేధింపుల పర్వం పరాకాష్ఠకు చేరుతోంది. డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ అనితారాణి, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ వేధింపులను ఎదుర్కొన్నట్టే, ఇప్పుడు మరో దళిత అధికారి కూడా వేటుకు గురయ్యారు. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సందర్భంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో, అదును చూసి ప్రకాశం జిల్లాలో ఓ ఎంపీడీవోని జడ్పీ సీఈవోకు సరెండర్‌ చేయించారు. ఆ వివరాల్లోకి వెళితే.. సీహెచ్‌ క్రిష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన గ్రూపు-1 అధికారి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి టంగుటూరులో ఎంపీడీవోగా పని చేస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రాల సందర్భంగా అధికారపార్టీ పెద్దలతో ఆయనకు విభేదాలు వచ్చాయి. క్రిష్ణ తన విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించడం వారికి రుచించలేదు. విత్‌డ్రాల తరువాత పోటీలో ఇంకెంతమంది అభ్యర్థులు ఉన్నారనేది ఎన్నికల అధికారిగా ఆయన ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ ప్రకటన చేయకుండా క్రిష్ణను ఆ రోజంతా వారు అడ్డుకొన్నారు. దీనిపై రాత్రంతా మండలపరిషత్‌ కార్యాలయం వద్ద హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి వేళ జిల్లా అధికారయంత్రాంగం సైతం టంగుటూరుకు కదిలొచ్చింది. జడ్పీ సీఈవో నాయకత్వంలో జిల్లా అధికారులు రాత్రంతా తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు.


చివరకు, అధికార పార్టీ అభ్యర్థులు వేసిన మెజారిటీ నామినేషన్లను ఆమోదిస్తూ ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో క్రిష్ణను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అప్పటినుంచే అధికారపార్టీ పెద్దలు ఆయనను బదిలీ చేయించాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎంపీడీవోల బదిలీలపై నిషేధం ఉండటంతో ఆయనను కదిలించలేకపోయారు. అయినా, వారు తమ ఒత్తిడిని అధికార యంత్రాంగంపై కొనసాగించారు. ఈ నేపథ్యంలో సెలవుపై వెళ్లాల్సిందిగా క్రిష్ణకు జడ్పీ సీఈవో సూచించారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఈ వ్యవహారం జరుగుతుండగానే గత వారం టంగుటూరులో ఈవోఆర్‌డీగా పనిచేస్తున్న అధికారికి ఎంపీడీవోగా అదనపు బాధ్యతలనిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాను విధుల్లో ఉండగా మరొకరికి తన బాధ్యతలను అప్పగించడం ఏమిటంటూ క్రిష్ణ నిరసన తెలిపారు. దీనిపై ఆయన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, కలెక్టర్‌, జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఇరుకునపడ్డ సీఈవో.. సెలవు పెట్టాలంటూ మరోసారి ఆయనను బలవంతపెట్టారు. ఇందుకు క్రిష్ణ అంగీకరించలేదు. 


పాతఫైల్‌ను తవ్వితీసి..

ఎలాగైనా తప్పించాలంటూ అధికార పార్టీ పెద్దల నుంచి అదేపనిగా ఒత్తిళ్లు వస్తుండటంతో కొందరు అధికారులు.. క్రిష్ణని గట్టిగానే టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో ఎంపీటీసీ నామినేషన్ల నాటి ఫైల్‌ వెలికితీశారు. ఆ రోజున కొన్ని పొరపాట్లు చేసినట్లు ఆయనపై ఆర్డీవో అభియోగాలు మోపారు. ఆ అభియోగాలు తేలేవరకు జడ్పీ సీఈవో కార్యాలయంలో సరెండర్‌ కావాలంటూ బుధవారం కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, క్రిష్ణపై చర్య తీసుకోవడాన్ని దళిత సంఘాలు నిరసిస్తున్నాయి.


నిజాయితీకి ఇదా బహుమానం?: క్రిష్ణ 

‘‘నాపై అసంబద్ధ అభియోగాలు మోపారు. 14ఏళ్ల సర్వీసులో నిజాయితీగా ఉన్నందుకు లభించిన బహుమానం ఇది. స్థానిక ఎన్నికల సమయంలో మాట వినలేదని కక్ష కట్టారు. అప్పటి ఫైల్‌ బయటకు తీసి లేనిపోనివి సృష్టించి సరెండర్‌ కావాలనే ఆదేశాలు ఇప్పించారు. ఉన్నధికారులు న్యాయం చేయాలి’’

Updated Date - 2020-06-19T09:48:27+05:30 IST