నా ప్రాణాలకు ముప్పుంది!

ABN , First Publish Date - 2020-06-22T08:31:11+05:30 IST

తన ప్రాణాలకు ముప్పుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

నా ప్రాణాలకు ముప్పుంది!

  • కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి
  • లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
  • చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు
  • నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు
  • లేఖలో నరసాపురం ఎంపీ ఫిర్యాదు
  • కేంద్ర హోం శాఖకు పంపిన సభాపతి
  • అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరిన రఘు!
  • బెదిరింపులపై పశ్చిమ ఎస్‌పీకి లేఖ
  • ఫిర్యాదు చేసినా కేసులు పెట్టలేదని వెల్లడి
  • నలుగురు ఎస్సైలపై చర్యలకు వినతి


అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తన ప్రాణాలకు ముప్పుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. చంపేస్తామని తనను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. దూషిస్తున్నారని, దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని.. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. అలాగైతేనే నియోజకవర్గంలో తిరగగలుగుతానని తెలిపారు. సొంతపార్టీ కార్యకర్తలు, నేతల నుంచే భద్రత కల్పించాలని కోరుతూ రాసిన ఈ లేఖపై స్పందించిన స్పీకర్‌.. దానిని కేంద్ర హోంశాఖకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేగాక స్పీకర్‌తో రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగామాట్లాడినట్లు సమాచారం.


అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్లు తెలిసింది. ఈ అంశాలపై రఘురామకృష్ణంరాజు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తనపై బెదిరింపులకు పాల్పడడం వల్లే మూడు రోజుల క్రితం సభాపతికి లేఖ రాశానని తెలిపారు. నిబంధన మేరకు దానిని బయటపెట్టలేనని చెప్పారు. ‘ఆధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు నా దిష్టిబొమ్మలు దహనం చేశారు. నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. నియోజకవర్గానికివస్తే చంపేస్తామని బెదిరించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన నేను.. ఈ రోజు కాకపోయినా రేపయినా నా నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పర్యటించాలంటే వ్యక్తిగత రక్షణ కావాలి. కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తేనే వెళ్లగలుగుతా’ అని తెలిపారు. టీటీడీ ఆస్తులను అమ్మాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, తాను శ్రీవారి పరమ భక్తుడినని, స్వామి ప్రసాదాన్ని తరుచూ పార్లమెంటు సభ్యులకు పంచిపెడుతుంటానని, అలాంటిది స్వామి ఆస్తులు అమ్ముతామంటే ఎందుకు ఊరుకుంటాననివ్యాఖ్యానించారు.


ఎంపీలంటే జగన్‌కు పూచిక పుల్లలు!

కేంద్ర బలగాల రక్షణతో తాను రాష్ట్రంలో తిరిగితే జగన్‌ ప్రభుత్వానికే తలవంపులని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్‌ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ ఎంపీలంటే ఆయనకు పూచిక పుల్లలతో సమానమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డే అంతా నడిపిస్తారని, ఆయనకు తప్పుడు సలహాలిస్తారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పిలిపిస్తే వెళ్లి కలుస్తానని, కానీ ఆయన పిలుస్తారని తాను అనుకోవట్లేదన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని, తనను ఎందుకు స స్పెండ్‌ చేస్తారన్నారు. రాష్ట్రంలో ఇసుక ధరను 600 శాతం పెంచడంతో నిర్మాణ కార్యక్రమాలు స్తంభించడంపై మీడియా ద్వారా జగన్‌ దృష్టికి తీసుకచ్చానని.. అప్పటినుంచే తనపై దాడులు మొదలయ్యాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.


‘ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వారు వీరంగం చేసినా ఏమీ అనడం లేదు. పెళ్లికి వెళ్లినందుకు కేసులు పెట్టే పోలీసులు.. నన్నుచంపుతామని బెదిరించినా, దానిపై ఫిర్యాదు చేసినా ఏమీ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్‌ను ఆశ్రయించక తప్పలేదు’ అని చెప్పారు.


జిల్లా ఎస్పీకి ఎంపీ పీఎస్‌ లేఖ

ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పీకి ఆదివారం లేఖ రాశారు. ఎంపీని అసభ్య పదజాలంతో డూషిస్తూ.. చంపుతామని బెదిరిస్తూ.. కులదూషణలు చేస్తున్న వైసీపీ కార్యకర్తల నుంచి రక్షణ కావాలని కోరుతూ 17, 18 తేదీల్లో ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని ఎస్సైలపై సెక్షన్‌ 154(3) ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


చర్యలపై వైసీపీ తర్జనభర్జన

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఏం చేయాలోనని వైసీపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇసుక, ఇళ్ల స్థలాల్లో భారీ అవినీతి జరుగుతోందని సొంత పార్టీ నేతలపైనే  ఆయన బాహాటంగానే విరుచుకుపడ్డారు. సీఎం చుట్టూ ఉండే కోటరీ వల్ల అపాయింట్‌మెంట్‌ దొరకట్లేదని ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు తనను టార్గెట్‌ చేయడంతో.. జగన్‌ బొమ్మ పెట్టుకుని తాను గెలవలేదని.. తనవల్లే ఆ ఎమ్మెల్యేలు గెలిచారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే రాజీనామా చేసి జగన్‌ బొమ్మ పెట్టుకుని మళ్లీ పోటీచేయాలని సవాల్‌ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేల విమర్శలు తీవ్రం కావడంతో.. తాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగితేనే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని వైసీపీ నాయకత్వం బతిమాలితేనే తాను వచ్చానని చెప్పారు.


ఈ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందని, పందులే గుంపులుగా వస్తాయంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆరోపణలు చేసినవారిపై వారి కులాల నేతలనే ప్రేరేపిస్తున్నారనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇక ఆయన్ను పార్టీ నుంచి వెలివేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో సాన్నిహిత్యం ఉండడంతో.. సస్పెండ్‌ చేస్తే నేరుగా వారి సమక్షంలోనే బీజేపీలో చేరవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయన వెంట ఇంకెవరైనా ఎంపీలు ఉన్నారా అని వైసీపీ నాయకత్వం ఆరా తీస్తోందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కనీసం ఇంతవరకు సంజాయిషీ కూడా కోరలేదని గుర్తుచేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని మాత్రమే సీనియర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చర్యల గురించి దాటవేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను దూరం చేసి రఘురామకృష్ణంరాజును ఒంటరిని చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-06-22T08:31:11+05:30 IST