ఎంపీ దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-09-17T09:12:38+05:30 IST

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ రావు (63)ఆకస్మికంగా మృతి చెందారు. గత 15 రోజులుగా చెన్నైలోని ఓ కార్పొరేట్‌

ఎంపీ దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం

కరోనా నుంచి కోలుకున్నా.. గుండెపోటుతో మృతి

15 రోజులుగా చెన్నైలో చికిత్స

ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్‌

అది గుండెకు చేరడంతో తుదిశ్వాస

మోదీ, గవర్నర్‌, సీఎం సంతాపం


నెల్లూరు. సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ రావు (63)ఆకస్మికంగా మృతి చెందారు. గత 15 రోజులుగా చెన్నైలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బుధవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 15 రోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో ఆయన చెన్నైలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజులకు కోలుకున్నారు. తర్వాత నిర్వహించిన వరుస పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయితే కరోనా కారణంగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు గురికావడంతో చికిత్స కొనసాగించారు. ఈ చికిత్స కొనసాగుతుండగానే ఆ ఇన్ఫెక్షన్‌ గుండెకు సోకడంతో గుండెపోటుతో మరణించారు. గురువారం మధ్యాహ్నం వెంకటగిరిలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరంలో జన్మించిన ఆయన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకుని, కొంతకాలం అడ్వొకేట్‌గా పని చేశారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా గూడూరు నుంచి బరిలోకి దిగి 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1996-98 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్‌ లభించదని ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీ పురోగతికి ప్రభావవంతంగా పనిచేసిన ఎంపీ దుర్గాప్రసాద్‌ మరణం బాధాకరమని ప్రధాఇ మోదీ ట్విటర్లో పోస్టు చేశారు. ఎంపీ మృతిపై గవర్నర్‌ విశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-17T09:12:38+05:30 IST