కొల్లగొట్టిన సొమ్ము మారిషస్‌కు తరలిస్తున్నారా!: లోకేశ్
ABN , First Publish Date - 2020-07-19T08:54:29+05:30 IST
ఏపీలో కొల్లగొట్టిన కోట్లకొద్దీ డబ్బు చెన్నై నుంచి మారిషస్ వెళ్తోందా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. శనివారం ఆయన

అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): ఏపీలో కొల్లగొట్టిన కోట్లకొద్దీ డబ్బు చెన్నై నుంచి మారిషస్ వెళ్తోందా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. శనివారం ఆయన దీనిపై ట్వీట్ చేశారు. ‘‘ఇక్కడి డబ్బును వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయట పడింది. ఆ డబ్బు హవాలా మార్గంలో అక్కడ నుంచి మారిష్‌సకు వెళ్తోందా అన్నది ఇప్పుడు తేలాలి. చెన్నైలో ఒకే చిరునామాతో ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ అనే కంపెనీలు ఉన్నాయి. వీటికి వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన ఏడాది సెప్టెంబరు 20న రిజిస్టర్ చేశారు. అంటే ఇది సూట్ కేస్ సంస్థ అన్నట్లే కదా! ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.