ఉద్యమ ఉప్పెన!

ABN , First Publish Date - 2020-12-17T07:34:57+05:30 IST

ప్రభుత్వానికి ఇచ్చిన భూములకు పరిహారం పెంచాలనే డిమాండ్‌తో జరిగిన ఉద్యమాలను చూశాం! అసలు భూములే ఇచ్చేది లేదని తేల్చి చెప్పి.

ఉద్యమ ఉప్పెన!

‘మూడు’పై మండుతున్న రాజధాని రైతు

ఏడాదిగా దించకుండా ఎత్తిన పిడికిలి!

దేశ చరిత్రలోనే భారీ భూసమీకరణ

పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి భూములు

34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది

అందులో 20 వేల మంది బడుగు రైతులే

సర్కారు మారగానే నేలరాలిన ఆశలు

లాఠీలు, కేసులతో అణచివేత యత్నాలు

ఎలా న్యాయం చేస్తారో చెప్పని సర్కారు

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఇచ్చిన బంద్‌ పిలుపునకు వైసీపీ సర్కారు మద్దతు ఇచ్చింది. కానీ... ఏడాదిగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులతో ఒక్కసారీ చర్చలు జరపలేదు. వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పలేదు! పైసా ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారో కూడా చెప్పడంలేదు.

రాజధాని ఉద్యమానికి నేటితో ఏడాది

‘మాది మనసున్న ప్రభుత్వం. రైతు అనుకూల ప్రభుత్వం. బడుగులను ఆదుకునే ప్రభుత్వం’ అని వైసీపీ పెద్దలు పదేపదే చెబుతుంటారు. సందర్భమొచ్చిన ప్రతిసారీ మెడలో ఆకుపచ్చ కండువాతో కనిపిస్తారు. అయితే రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 20 ఎకరాలకుపైగా ఇచ్చిన పెద్ద రైతులు 17 మందే. ఎకరం, అరెకరం ఉన్న బడుగు రైతులు 20 వేల మంది! అందులోనూ ఎస్సీ, బీసీలే ఎక్కువ. ప్రభుత్వం దృష్టిలో వీరు రైతులు కారా? వీరికి ఎలా న్యాయం చేస్తారు? 


(అమరావతి - ఆంధ్రజ్యోతి):ప్రభుత్వానికి ఇచ్చిన భూములకు పరిహారం పెంచాలనే డిమాండ్‌తో జరిగిన ఉద్యమాలను చూశాం! అసలు భూములే ఇచ్చేది లేదని తేల్చి చెప్పి... తాడోపేడో తేల్చుకున్న ‘నందిగ్రాం’లనూ చూశాం! కానీ... ‘రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం మనది. అమరావతి కోసం భూములివ్వండి. రాష్ట్రం బాగుంటుంది. మీకూ మేలు జరుగుతుంది’ అని ప్రభుత్వం చెప్పిన మాటను నమ్మి, పైసా చేతిలో పెట్టకున్నా 34 వేల ఎకరాలు అప్పగించిన రైతులను దేశంలో ఒక్క అమరావతిలోనే చూస్తున్నాం! ఒక ప్రభుత్వం పెంచిన ఆశలను, మరో ప్రభుత్వం అడియాశ చేయగానే... ఉసూరుమని, ఆపై ఉద్యమిస్తున్న రైతులనూ అమరావతిలోనే చూస్తున్నాం! సాగుకు దూరమయ్యారు. బాగుకూ దూరమయ్యారు. ప్రభుత్వానికి అప్పగించిన భూములు రూపు మారిపోయాయి. భవనాలూ, రోడ్ల నిర్మాణంతో హద్దులు చెరిగిపోయాయి. భూసమీకరణకు బదులుగా ఇచ్చిన ప్లాట్లకు ధర పెరుగుతుందని, బతుకు బాగుపడుతుందని వీరు ఆశించారు.


కానీ, ఎన్నికల ముందు ‘జై అమరావతి’ అని నమ్మించిన వైసీపీ... అధికారంలోకి రాగానే ‘నై అమరావతి’ అని రైతుల నెత్తిన నిప్పులు కురిపించింది. కళ్లముందు నిలువెత్తు నిర్మాణాలు కనిపిస్తున్నా...  ‘అక్కడ ఒక్క ఇటుకా పడలేదు’ అని మభ్యపెట్టింది.. తర్వాత... ‘వరద వస్తే మునిగిపోతుంది’ అని తప్పుడు ప్రచారం చేసింది. ఆ తర్వాత... ‘ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి’ అని దుష్ప్రచారం చేసింది. ‘కుక్కను చంపాలనున్నప్పుడు... దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి’ అనే సూత్రాన్ని పాటించారు. కానీ... అవేవీ ఫలించలేదు. దీంతో... ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట ‘మూడు రాజధానుల’ను తెరపైకి తెచ్చింది. ‘అమరావతి’లో ఏడాదికి 40-50 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామంటూ... దానికి ‘శాసన రాజధాని’ అనే గొప్ప పేరు పెట్టింది. సరిగ్గా ఏడాది క్రితం... 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ చేసిన ఈ ప్రకటనతో రాజధాని రైతుల్లో గుబులు మొదలైంది. అది ఆగ్రహంగా మారింది. ఉద్యమమై ఉబుకుతోంది.


ఇదే మొదటిసారి... 

స్థిరమైన, సుదీర్ఘమైన ఉద్యమాలకు సీమాంధ్రులు తొలి నుంచీ దూరమే! అప్పుడెప్పుడో ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అని తెలుగువాడు నినదించి, అనుకున్నది సాధించాడు. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గుంటూరులో హైకోర్టు కోసం కొద్దికాలం ఉద్యమం జరిగింది. ఆ తర్వాత... 2014లో రాష్ట్ర విభజనకు ముందు ‘సమైక్యాంధ్ర ఉద్యమం’ జరిగింది. దీనికి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా ఈ ఉద్యమానికి సహకరించింది. కానీ... అమరావతి ఉద్యమం అలాంటిది కాదు.  రాజధాని రైతులు ఏడాదిగా ఎత్తిన పిడికిలి దించలేదు. ప్రభుత్వానిది వీరిపై ఆది నుంచీ అణచివేత ధోరణే. రోడ్ల పక్కన  టెంట్లు వెయ్యనివ్వలేదు. దుర్గమ్మకు పొంగళ్లు పెడతామంటే కాలు కదలనివ్వలేదు. ‘ముట్టడి’ పిలుపులను కట్టడి చేశారు. ఏకంగా... ఐపీఎస్‌ అధికారులే లాఠీలు పట్టుకుని రైతులను తరిమారు. ‘పట్టు చీరలు కట్టారు, టీ షర్టులు తొడిగారు... వీళ్లేం రైతులు’ అని ప్రభుత్వ పెద్దలు ఎద్దేవా చేశారు.


పోటీ ఉద్యమాలను ఎగదోశారు. చిన్నా చితక కారణాలతో కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. అయినా... రైతులెవరూ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు ఇల్లు, పొలం తప్ప బయటి ప్రపంచం ఎరుగని ఆడపడుచులే ఇప్పుడు ఉద్యమ సారథులయ్యారు. అమరావతి ఉద్యమానికి వివిధ పార్టీలది పరోక్ష మద్దతే! ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నది ఇక్కడి రైతులే. ‘న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం’ అని వీరు తేల్చి చెబుతున్నారు. వారికి జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తోంది. కానీ... ప్రభుత్వం వీరికి ఎలా న్యాయం చేస్తుంది? ఇదే నేటి ప్రశ్న.

Updated Date - 2020-12-17T07:34:57+05:30 IST