అప్పుల కోసం ఆస్తుల తాకట్టు

ABN , First Publish Date - 2020-12-10T08:59:08+05:30 IST

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీటీడీసీ(ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌)కు చెందిన రూ.202 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు తాకట్లు పెట్టేందుకు

అప్పుల కోసం ఆస్తుల తాకట్టు

ఏపీటీడీసీకి ప్రభుత్వం అనుమతి


అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీటీడీసీ(ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌)కు చెందిన రూ.202 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు తాకట్లు పెట్టేందుకు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌ బార్గవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 నెలలుగా కరోనా వైరస్‌ వల్ల ఏపీటీడీసీ ఆదాయం పూర్తిగా పడిపోయిందని, కార్పొరేషన్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చివరికి కార్పొరేషన్‌ నిర్వహణ కూడా కష్టంగా మారిందని కార్పొరేషన్‌ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు.ప్రతి నెలా ఆదాయం కంటే ఖర్చు పెరుగుతోందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే తప్ప ఆదాయం పెరిగే అవకాశం లేదన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి రూ.142 కోట్ల వరకూ ఖర్చవుతుందని, ఆ మేరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.202 కోట్ల విలువైన ఏపీటీడీసీ ఆస్తులను తాకట్లు పెట్టేందుకు కూడా అనుమతిచ్చింది.


ఏపీకి 2,525 కోట్ల అదనపు రుణ పరపతి

న్యూఢిల్లీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రాష్ర్టాలకు ఆర్ధికంగా కొంతమేరకు చేయూత నివ్వాలన్న లక్ష్యంతో కేంద్రం అదనపు రుణ పరపతి సౌకర్యం కల్పిస్తోంది. ఒకేదేశం-ఒకే రేషన్‌ కార్డు, విద్యుత్‌ పొదుపుతోపాటు వ్యాపారం, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాల్లో సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు ఏపీ, తెలంగాణ, గోవా, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, కేరళ, తిప్రుర, యూపీ(తొమ్మిది) రాష్ర్టాలకు మొత్తం రూ.23,523 కోట్ల మేర అదనపు రుణాలు పొందేందుకు అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఏపీకి రూ.2,525 కోట్ల చొప్పున అదనపు రుణాలు పొందడానికి అనుమతించినట్లు తెలిపింది.

Updated Date - 2020-12-10T08:59:08+05:30 IST