ఇసుక మరింత భారం!

ABN , First Publish Date - 2020-11-27T09:05:11+05:30 IST

ఒకవైపు కొత్త ఇసుక విధానంపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు... వినియోగదారులకు ఇసుక ధర చుక్కలు చూపిస్తోంది.

ఇసుక మరింత భారం!

అధికారికంగా పెంచకున్నా... పైపైకి ధర.. కొన్నిచోట్ల 18 టన్నుల ఇసుక రూ.26 వేలు

నెలలోనే సుమారు రూ.1,500 అదనం

డిపోలు మారడంతో పెరిగిన రవాణా ఖర్చు

నిర్వహణ వ్యయం పెరిగిందంటూ బాదుడు


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఒకవైపు కొత్త ఇసుక విధానంపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు... వినియోగదారులకు ఇసుక ధర చుక్కలు చూపిస్తోంది. అంతకంతకు పెరుగుతూ అందకుండా పరుగులు తీస్తోంది. అధికారికంగా ప్రభుత్వం ధర పెంచనప్పటికీ విధానపరమైన లోపాలతో తలెత్తిన ఇబ్బందులతో ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు, బ్లాక్‌లో కూడా దొరకని ఇసుకతో నిర్మాణదారులు సతమతమవుతున్నారు. టన్ను ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 375 మాత్రమే. కానీ... రవాణా, నిర్వహణ వ్యయంతోపాటు ‘బ్లాక్‌’లో టన్ను రూ.1300కు తక్కువ దొరకడంలేదు. మొత్తం ఽఖర్చులో ఇసుక ధర 35శాతమైతే రవాణా, నిర్వహణ చార్జీలు 65శాతం. కృష్ణాజిల్లాలో రోజుల వ్యవధిలోనే టన్ను లారీ ఇసుక రూ.1,500 పెరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలాంటి చోట్ల లారీ ఇసుకను రూ.26వేలు పోసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏడాదిన్నరగా ఇసుక కష్టాలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఇప్పుడు మరింత షాక్‌ కొడుతోంది. ఉచిత ఇసుక విధానంలో 18ఙ టన్నుల ఇసుక రూ.6వేలకు లభించేది. ఇప్పుడు దాదాపు మూడు రెట్లయింది. ప్రభుత్వ లెక్క ప్రకారం 18 టన్నుల ఇసుక ధరే రూ.6,750. రవాణా, ఇతర ఖర్చులు రూ.6 వేలు కలుపుకొన్నా రూ.12,750కు ఇసుక రావాలి. కానీ, రూ.20 వేల నుంచి 25వేలు పెడితే కానీ 18 టన్నుల ఇసుక రావడంలేదు. ఇటీవల డిపోల నిర్వహణ, రవాణా వ్యయాలు మరింత పెరిగిపోయాయి. డిపో మారడం వల్ల దూరం పెరగడం, డిపోల నిర్వహణ వ్యయం రకరకాలుగా ఉండటంతో అదనపు భారం పడుతోంది.


విజయవాడ ఆటోనగర్‌లో ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక వ్యక్తి గతనెలలో 18టన్నుల ఇసుక లోడ్‌ రూ.16,400కు కొనుగోలు చేశారు. ఇప్పుడు అదే ఇసుకకు రూ.17,833 చెల్లించాల్సి వచ్చింది. ఇందులో ఇసుక ధర... రూ.6750.రీచ్‌ నుంచి డిపోకు తెచ్చినందుకు రూ.5040, ఇంటికి డెలివరీ చార్జీ రూ.6043వేశారు. గతంలో ఇబ్రహీంపట్నం డిపోనుంచి ఇసుక వచ్చేదని, అక్కడ అయిపోవడంతో మరో డిపో నుంచి తెచ్చామని తెలిపారు. కొత్త డిపోలో నిర్వహణ వ్యయం ఎక్కువని... ఆ చార్జీ కూడా పెరిగిందంటూ కొత్త లెక్క చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లూరులో ఒకాయన ఇసుక బుక్‌ చేసుకోవాలనుకున్నాడు. కొల్లూరులోనే రీచ్‌ ఉన్నా అక్కడ ఇసుక అందుబాటులో ఉన్నట్లు చూపించడంలేదు. అక్కడికి 60కిలోమీటర్ల దూరంలో ఇసుక ఉన్నట్లు చూపిస్తోంది. అంత దూరం అంటే రవాణా వ్యయం తడిసిమోపెడవుతుందని ఇసుక వేయించుకోవడమే మానుకున్నాడు. 

Read more