మోడల్ స్కూల్స్ పోస్టులు రేషనలైజేషన్ చేయొద్దు
ABN , First Publish Date - 2020-10-27T08:19:46+05:30 IST
మోడల్ స్కూల్స్ పోస్టులు రేషనలైజేషన్ చేయొద్దని పీడీఎఫ్, యూటీఎఫ్.. విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశాయి.

విద్యాశాఖకు పీడీఎఫ్, యూటీఎఫ్ వినతి
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూల్స్ పోస్టులు రేషనలైజేషన్ చేయొద్దని పీడీఎఫ్, యూటీఎఫ్.. విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశాయి. బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం యూటీఎఫ్, పీడీఎఫ్ ప్రతినిధుల బృందం విజయవాడలో సమగ్రశిక్ష కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ వి.చినవీరభద్రుడులను కలిసి చర్చించారు. 81-90 మధ్య పిల్లలు ఉన్న పాఠశాలలు 456 ఉన్నాయని, ఆ పైన విద్యార్థులున్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పోస్టులు రేషనలైజేషన్ చేయవద్దని, విద్యార్థులు పెరిగిన పాఠశాలల్లో 14.10.2020 నాటి ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న పోస్టులు రద్దు చేయొద్దని వారు కోరారు. మోడల్ స్కూల్స్ కాన్సెప్ట్ ఆమోదించలేమని, విద్యా హక్కు చట్టం ప్రకారం 1:30 నిష్పత్తిలో రేషనలైజేషన్ చేస్తామని లేకుంటే అన్ని స్కూళ్లకు టీచర్లను సర్దుబాటు చేయలేమని అధికారులు చెప్పారు. మౌలిక వసతులు పెరిగిన నేపథ్యంలో 80 పైబడిన విద్యార్థులున్న పాఠశాలల్లోని ప్రస్తుతం ఉన్న టీచర్ పోస్టులు కొనసాగించాలని, 14.10.2020 నాటికి పెరిగిన ఎన్‌రోల్‌మెంట్‌కు అనుగుణంగా పోస్టులు ఇవ్వాలని ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దానిపై జాయింట్ కలెక్టర్లకు తగు ఆదేశాలిస్తామని అధికారులు తెలిపారు.