అనర్హత విచారణకు ఎమ్మెల్సీలు గైర్హాజరు

ABN , First Publish Date - 2020-06-04T09:13:39+05:30 IST

అనర్హత పిటిషన్‌పై విచారణకు ఇద్దరు ఎమ్మెల్సీలు బుధవారం గైర్హాజరయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం

అనర్హత విచారణకు ఎమ్మెల్సీలు గైర్హాజరు

అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): అనర్హత పిటిషన్‌పై విచారణకు ఇద్దరు ఎమ్మెల్సీలు బుధవారం గైర్హాజరయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిటిషన్‌పై శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో విచారణ చేపట్టారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, నెల సమయమివ్వాలని సునీత కోరారు. లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌ నుంచి తన తరపు న్యాయవాది రాలేదని.. అందువల్ల తాను రాలేక పోతున్నానని శివనాథరెడ్డి సమాచారం పంపారు. ఈ విచారణకు టీడీపీ తరపున విప్‌ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్సీ అశోక్‌బాబు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తమ వాదన వినిపించుకోవడానికి మరో అవకాశం ఇస్తామని, తేదీని త్వరలోనే నిర్ణయించి సమాచారమిస్తామని షరీఫ్‌ చెప్పారు.


మండలి అక్కర్లేదంటూ ఎందుకు కొంటున్నారో..!

శాసన మండలి అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్‌ అంటూనే.. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలిద్దరూ కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారని విమర్శించారు.

Updated Date - 2020-06-04T09:13:39+05:30 IST