ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2020-06-16T09:28:17+05:30 IST
ఏపీలో ఒక శాసనమండలి(ఎమ్మెల్సీ) స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూలు ..

‘డొక్కా’ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
25న నామినేషన్లు.. జూలై 6న పోలింగ్
న్యూఢిల్లీ/అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఒక శాసనమండలి(ఎమ్మెల్సీ) స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. చట్టసభల నుంచి మండలికి ఎన్నికయ్యే కోటాలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గతంలో ఎన్నికయ్యారు. అయితే, ఈ ఏడాది మార్చి 9న అనూహ్య పరిస్థితుల్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడుతుంది. అనంతరం, ఈ నెల 25న నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 26న పరిశీలన అనంతరం.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంటుంది. జూలై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
కౌన్సిల్ రద్దు ఇప్పట్లో లేనట్టేనా?
సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన శాసనమండలి రద్దు ప్రక్రియ ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితి లేకపోవచ్చని తెలుస్తోంది. మూడు నెలల కిందట ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడాన్ని బట్టి మండలి రద్దుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.