జేసీ ఇంట్లో ఎమ్మెల్యే వీరంగం

ABN , First Publish Date - 2020-12-25T09:37:34+05:30 IST

వాహనాల్లో రయ్య్‌మని దూసుకొచ్చారు. అనుచరులు, ఆయుధాలతో గేట్లు తీసుకుని మరీ లోపలికి వెళ్లారు. సినీ ఫక్కీలో హల్‌చల్‌ సృష్టించారు.

జేసీ ఇంట్లో ఎమ్మెల్యే వీరంగం

అనుచరులతో దూసుకొచ్చిన కేతిరెడ్డి

ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిపై దాడి

తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్‌ టెన్షన్‌

కేతిరెడ్డి భార్యపై ఇసుక ఆరోపణలతో

సోషల్‌మీడియాలో ఆడియో పోస్టింగు

అది జేసీ అనుచరుల పనేనంటూ

నేరుగా ఇంటిపైకి వచ్చిన ఎమ్మెల్యే

రాళ్లదాడులతో హోరాహోరీ 

పోలీసులే గేటు తీస్తే ఏమనాలి? జేసీ

మాట్లాడేందుకు వెళ్లా: కేతిరెడ్డి


అనంతపురం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అలా దూసుకొచ్చింది... తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి! దూసుకెళ్లింది... జేసీ దివాకర్‌ రెడ్డి సోదరుడైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంలోకి. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో తాడిపత్రి అట్టుడికిపోయింది. పరస్పర దాడులతో కొన్నిగంటలపాటు ఉద్రిక్తత రాజ్యమేలింది. జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ  విషయం తెలుసుకొన్న జేసీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హుటాహుటిన ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. 


పెద్దారెడ్డి అనుచరులతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఆ సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాళ్ల దాడి గంటపాటు యథేచ్ఛగా సాగింది. ఈ దాడుల్లో జేసీ ఇంటి కిటికీల అద్దాలతోపాటు ఇరువర్గాలకు చెందిన పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసు వాహనాలపైనా ఇరువర్గాల అనుచరులు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అనంతపురం జిల్లా కేంద్రం నుంచి అదనపు బలగాలు తాడిపత్రికి రప్పించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు, ఆయా పార్టీల శ్రేణులను బలగాలు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.


అసలేం జరిగింది?

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి ఎడ్ల బండి ఇసుకకు రూ. 10 వేలు వసూలు చేస్తున్నారంటూ ఓ కాంట్రాక్టర్‌, ఓ ఎద్దులబండి యజమాని మధ్య ఫోన్‌ సంభాషణ సాగింది. ఆ ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘ఎమ్మెల్యే భార్య బండి ఇసుకకు రూ. 10 వేలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో రూ.10 వేలు కట్టి ఇసుక తోలలేం’ అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫోన్‌ సంభాషణ సారాంశం. ఈ ఫోన్‌ సంభాషణ ఆడియోను టీడీపీ మద్దతుదారు వలీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆయన వర్గీయులు చెప్పారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు గురువారం రెండు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు.


ఒక్కసారిగా వాహనాల్లో నుంచి దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభాకర్‌రెడ్డి ఇంటి గేట్లను తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించారు. వలీ ఎక్కడంటూ....ఇంట్లోని గదులన్నీ గాలించారు. అక్కడున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను ఇదే విషయంపై గద్దించారు. తనకు తెలియదని చెబుతున్న క్రమంలోనే... ఎమ్మెల్యే అనుచరులు కిరణ్‌పై దాడికి పాల్పడ్డారు. కాగా... ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏకంగా ఎమ్మెల్యే ఇంట్లోకి రావడంతో ఆమె వేరొక గదిలోకి వెళ్లిపోయారు.  హైదరాబాద్‌కు వెళ్తున్న తన భర్త జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. డీఎస్పీకి కూడా ఫోన్‌ చేశారు. భార్య ఫోన్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి మార్గమధ్యలోనే తమ వాహనాలను తిప్పుకొని తాడిపత్రికి తిరుగు ప్రయాణమయ్యారు.


ఈలోపే జేసీ అనుచరులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు  చేరుకున్నాయి. అప్పటికే అక్కడ తిష్ట వేసిన ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి , వారి అనుచరులు, వైసీపీ శ్రేణులతో జేసీ వర్గీయులు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన కొద్దిసేపటికి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు.


దూసుకొచ్చిన కారు.. కుర్చీ కాల్చివేత..

జేసీ ప్రభాకర్‌రెడ్డి రాకతో... ఆయన వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. డీఎస్పీ చైతన్యతో పాటు పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గీయుల కారు జేసీ వర్గీయులపైకి దూసుకువచ్చింది. దీనిపై ఇరువర్గీయులు పరస్పరం వాహనాలపై రాళ్లు రువ్వుకొన్నారు. చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో అటువైపు రావడం జేసీ వర్గీయుల కంటపడింది.


హర్షవర్ధన్‌రెడ్డిపై రాళ్ల దాడులకు దిగడంతో, జేసీ నివాసం పక్క సందులోని ఓ ఇంట్లోకి ఆయన వెళ్లి తలుపులు మూసుకున్నారు. జేసీ వర్గీయులు ఆ ఇంటిపై రాళ్లు రువ్వారు. హర్షవర్ధన్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద ఎత్తున ఆ ఇంటి వద్దకొచ్చారు. ఒక్కసారిగా అటూఇటూ జేసీ, ఎమ్మెల్యే వర్గీయులు పెద్దఎత్తున గుమిగూడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. 


హర్షవర్ధన్‌రెడ్డితో పాటు అతని అనుచరులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడే జేసీ వర్గీయులు మాటు వేయడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. చివరికి పోలీసు అధికారులు తుపాకులు తీసి కాల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసి జేసీ వర్గీయులను అక్కడి నుంచి చెదరగొట్టారు. హర్షవర్ధన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులను అక్కడి నుంచి పంపించివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా,  ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడున్న ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఆ విషయం సీసీ ఫుటేజీల ద్వారా తెలుసుకున్న జేసీ వర్గీయులు ఆ కుర్చీని బయటకు తీసుకువచ్చి తగులబెట్టేశారు. కాగా, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చినట్లు తహసీల్దార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 


ఫిర్యాదు చేయను..సుమోటోగా కేసు పెట్టాలి

జేసీ ప్రభాకర్‌రెడ్డి

‘‘నా ఇంటిపైకి దాడికి వచ్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలి. నేను ఫిర్యాదు చేయను. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరగదు. ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చారంటే అది పోలీసుల తప్పే.ఎమ్మెల్యే నా ఇంట్లోకి రావడానికి ఒక ఎస్‌ఐ గేటు తలుపులు తీశారు. గన్‌మెన్‌లతోపాటు మిగతా పోలీసులు ఆయన వెంట వచ్చారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా...? నా బంధువులకు ఆరోగ్యం బాగాలేకుంటే హైదరాబాద్‌కు వెళ్తుండగా.. ఈ విషయం తెలిసి తిరిగి వచ్చాను. ఇంట్లో లేనప్పుడు కొజ్జావాళ్లైనా వచ్చిపోతారు’’


ఆ పోస్టింగ్‌లపై మాట్లాడేందుకు వెళ్లా

కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే

‘‘గూండాలను పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చి రెచ్చగొట్టే పోస్టింగ్‌లు (జేసీ ప్రభాకర్‌రెడ్డి) పెట్టిస్తున్నారు. నా కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సొమ్ము తింటున్నారని పోస్టింగ్‌లు పెట్టారు. ఇలాంటి పోస్టింగులతో శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని జేసీ ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన అక్కడ లేకపోవడంతో కొద్దిసేపు కూర్చొని వచ్చానేతప్ప దాడి చేసేందుకు వెళ్లలేదు. ఒకవేళ ఉంటే రోజూ ఆయన తిరుగుతూ కనిపిస్తుంటారు కదా? టీడీపీ వర్గాల దాడిలో మా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒక వాహనం దెబ్బతినింది’’


రాళ్లు రువ్వుతున్న జేసీ వర్గీయులపై తుపాకులు ఎక్కుపెట్టిన డీఎస్పీ, పోలీసులు

రాళ్ల దాడులకు సాక్ష్యంగా నిలిచిన రోడ్డుUpdated Date - 2020-12-25T09:37:34+05:30 IST