తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్‌ టెన్షన్‌.. అసలేం జరిగింది!?

ABN , First Publish Date - 2020-12-25T06:22:45+05:30 IST

ఏపీలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు

తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్‌ టెన్షన్‌.. అసలేం జరిగింది!?

జేసీ ఇంట్లో ఎమ్మెల్యే వీరంగం

అనుచరులతో దూసుకొచ్చిన కేతిరెడ్డి

ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిపై దాడి

జేసీ కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే

ప్రభాకర్‌రెడ్డి లేని టైమ్‌లో హల్‌చల్‌

జేసీ,ఎమ్మెల్యే వర్గాలమధ్య బాహాబాహీ


అనంతపురం(ఆంధ్రజ్యోతి): ఏపీలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు. ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది.


విషయం తెలుసుకొన్న జేసీ వర్గీయు లు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హుటాహుటిన ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నాయి. అప్పటికి జేసీ ఇంకా ఇంటికి చేరుకోలేదు. ఇంటి వద్ద జేసీ అనుచరులు.. పెద్దారెడ్డి అనుచరులతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాళ్ల దాడి గంటపాటు యథేచ్ఛగా సాగింది. ఈ దాడుల్లో జేసీ ఇంటి కిటికీల అద్దాలతోపాటు ఇరువర్గాలకు చెందిన పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.


అసలేం జరిగింది?

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి ఎడ్ల బండి ఇసుకకు రూ. 10 వేలు వసూలు చేస్తున్నారంటూ ఓ కాంట్రాక్టర్‌, ఓ ఎద్దులబండి యజమాని మధ్య ఫోన్‌ సంభాషణ సాగింది. ఆ ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇసుక తేవాలని ఆ కాంట్రాక్టర్‌ ఆ ఎద్దులబండి యజమానిని కోరాడు. దీనికి ఆ యజమాని ఆ కాంట్రాక్టర్‌కు బదులిస్తూ.. ‘ఎమ్మెల్యే భార్య బండి ఇసుకకు రూ. 10 వేలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో రూ.10 వేలు కట్టి ఇసుక ఇవ్వలేం’ అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫోన్‌ సంభాషణ సారాంశం. ఈ ఫోన్‌ సంభాషణ ఆడియోను టీడీపీ మద్దతుదారు వలీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆయన వర్గీయులు చెప్పారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు గురువారం రెండు వాహనాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వలీ ఎక్కడంటూ.. ఇంట్లోని గదులన్నీ గాలించారు. అక్కడున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు దాసరి కిరణ్‌పై దాడి చేశారు. కాగా.. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.


హైదరాబాద్‌కు వెళ్తున్న తన భర్త జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. భార్య ఫోన్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి మార్గమధ్యలోనే తమ వాహనాలను తిప్పుకొని తాడిపత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈలోపే జేసీ అనుచరులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు  చేరుకున్నాయి. అప్పటికే అక్కడ తిష్ట వేసిన ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి, వారి అనుచరులు, వైసీపీ శ్రేణులతో జేసీ వర్గీయులు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన కొద్దిసేపటికి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాగా,  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని.. జేసీ వర్గీయులు బయటకు తీసుకొచ్చి తగులబెట్టేశారు.  


ఫిర్యాదు చేయను.. సుమోటోగా కేసు పెట్టాలి: ప్రభాకర్‌రెడ్డి

‘‘నా ఇంటిపైకి దాడికి వచ్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలి. నేను ఫిర్యాదు చేయను. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరగదు. ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చారంటే అది పోలీసుల తప్పే. ఎమ్మెల్యే నా ఇంట్లోకి రావడానికి ఒక ఎస్‌ఐ గేటు తలుపులు తీశారు. గన్‌మెన్‌లతోపాటు మిగతా పోలీసులు ఆయన వెంట వచ్చారు. ఇంట్లో లేనప్పుడు కొజ్జావాళ్లైనా వచ్చిపోతారు’’

 

మాట్లాడేందుకు వెళ్లా : ఎమ్మెల్యే పెద్దారెడి  

‘‘గూండాలను పెట్టుకొని వారికి జీతాలు ఇచ్చి రెచ్చగొట్టే పోస్టింగ్‌లు (జేసీ ప్రభాకర్‌రెడ్డి) పెట్టిస్తున్నారు.  ఇలాంటి పోస్టింగులతో శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన లేకపోవడంతో కొద్దిసేపు కూర్చొని వచ్చానే తప్ప దాడి చేసేందుకు వెళ్లలేదు’’. 

Updated Date - 2020-12-25T06:22:45+05:30 IST