అక్టోబరు గండం!

ABN , First Publish Date - 2020-09-16T09:15:00+05:30 IST

నెలనెలా గండంగా నెట్టుకొస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖకు.. మహాగండం పొంచి ఉంది! అన్ని వైపుల నుంచి అందినంత తెచ్చి ఆసరా పథకానికి రూ.6700 కోట్లు సర్దుబాటు చేశామని ఊపిరి పీల్చుకునే లోపే...

అక్టోబరు గండం!

  • 11వ తేదీకి అత్యవసరంగా రూ.14వేల కోట్లు కావాలి
  • జీతాలు, పెన్షన్లు, లోను రీపేమెంట్ల కోసం ఆర్థికశాఖ మల్లగుల్లాలు

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): నెలనెలా గండంగా  నెట్టుకొస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖకు.. మహాగండం పొంచి ఉంది! అన్ని వైపుల నుంచి అందినంత తెచ్చి ఆసరా పథకానికి రూ.6700 కోట్లు  సర్దుబాటు చేశామని ఊపిరి పీల్చుకునే లోపే... హైకోర్టు తీర్పు రూపంలో వచ్చే నెలలో మరో పెనుగండం ఎదురుచూస్తోంది. అక్టోబరు 11వ తేదీ నాటికి రాష్ట్రానికి అక్షరాలా రూ.14,000 కోట్లు అత్యవసరంగా కావాలి! ఈ నిధులు కేవలం ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, అవ్వాతాతలకు పెన్షన్లు, అప్పుల రీపేమెంట్లు చెల్లించడం కోసమే!  అసలే అత్తెసరు ఆదాయం. అప్పులిచ్చే నాథుడూ లేడు. ఆర్‌బీఐ ద్వారా మళ్లీ కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం ఎప్పుడు కరుణిస్తుందో తెలీదు. ఒకవేళ కేంద్రం ఆఘమేఘాల మీద కరుణించి ఎలాంటి కోతలూ పెట్టకుండా అప్పు తెచ్చుకునేందుకు అనుమతించినా వచ్చేది రూ.15వేల కోట్లు. ఈ అప్పులు ఆ నెలకే  సరిపోతాయి! పైగా ఈ రూ.15వేల కోట్లు ఇంత తక్కువ సమయంలో తెచ్చుకునేందుకు వీలవుతుందా? ఆర్‌బీఐ అందుకు ఒప్పుకొంటుందా అనేది మరో ప్రశ్న. ఒకవేళ కేంద్రం ఆ రూ.15వేల కోట్లలో కోత పెడితే ఆర్థికశాఖ ఎదుట ‘ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌’ తప్ప మరో అవకాశం లేదు. అది కూడా రూ.11వేల కోట్ల పరిమితి మాత్రమే ఉంది. ఈ తరహా రుణాలు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలి. బ్యాంకులు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అంటే కచ్చితంగా చెప్పలేని దుస్థితి.


హైకోర్టు ఏం చెప్పింది?

కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లను సగం మాత్రమే ఇచ్చారు. రెండు నెలలపాటు ఇలాగే చేశారు. ఆ తర్వాత హైకోర్టు కలగజేసుకుని అక్టోబరు 11 నాటికి వడ్డీతో సహా వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగులు, పెన్షనర్లంతా ఇప్పుడు కోర్టు తీర్పు మీదే ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం రూ.5,000 కోట్లు, అవ్వాతాతల పెన్షన్ల కోసం రూ.1,300 కోట్లు, అప్పుల రీపేమెంట్లకు రూ.2,800 కోట్లు, కరోనా సమయంలో ఆపిన రెండు నెలల సగం వేతనాల కోసం మరో రూ.5,000 కోట్లు ఇప్పుడు ప్రభుత్వానికి కావాలి. ఇందులో అన్నీ అత్యవసరమే. ప్రతి నెలా అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాకే ఉద్యోగులకు తీరిగ్గా 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ వేతనాలు, పెన్షన్లు ఇస్తున్నారు. పైగా అవ్వాతాతలకు ఈ ఏడాదికి పెంచాల్సిన రూ.250ని 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పెంచనేలేదు. ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల విషయంలో హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా కాలంలో కోత పెట్టిన వేతన బకాయిలను అక్టోబరు 11వ తేదీలోగా చెల్లించక తప్పదు. వీటితో పాటు సెప్టెంబరు నెల వేతనాలను ఆపడానికి లేదు. ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై ఆర్థికశాఖలో ఏకంగా ఒక బృందం పనిచేస్తోంది. 

Updated Date - 2020-09-16T09:15:00+05:30 IST