ఎవరి సొమ్ముతో ఎవరికి అండ?

ABN , First Publish Date - 2020-04-12T07:20:52+05:30 IST

‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అంటూ వరుసగా మంత్రులు సీఎం సొంత పత్రికలో మొదటి పేజీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అదేదో... ఎవరో చెప్పినట్లుగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు...

ఎవరి సొమ్ముతో  ఎవరికి అండ?

  • సీఎం పత్రికకు మంత్రి సురేశ్‌ ప్రకటన
  • టారిఫ్‌ విలువ రూ.1.36 కోట్లు
  • సమగ్ర శిక్షా విభాగంపై భారం!?
  • తలలు పట్టుకున్న అధికారులు
  • సీఎం పత్రికకు వరుసగా మంత్రుల ప్రకటనలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : ‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అంటూ వరుసగా మంత్రులు సీఎం సొంత పత్రికలో మొదటి పేజీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అదేదో... ఎవరో చెప్పినట్లుగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. వారి అధికారిక హోదాతో ప్రకటన ప్రచురితమవుతోంది. ఇదే కోవలో... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ నెల  8వ తేదీన జగన్‌ పత్రికకు మొదటి పేజీ ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంత్రిగారికి అండగా ఉందాం... అని ప్రజలకు పిలుపునిస్తూ, కరోనా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?  తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన శుభ్రత నియమాల గురించి ప్రకటనలో వివరించారు. సీఎం పత్రికలో మొదటి పేజీ మొత్తం (ఫుల్‌ పేజీ) ప్రకటన విలువ 1.36 కోట్ల రూపాయలు. కరోనా క్లిష్ట సమయంలో మంత్రులు ఇచ్చే ప్రకటనలు సీఎం సొంత పత్రికకు ‘ఆర్థికంగా’ అండగా ఉంటాయనడంలో సందేహంలేదు.


(ముఖ్యమంత్రికి అండగా ఉండటమంటే ఇదేనా... అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి) అయితే,  మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ మొత్తాన్ని ఆయన సొంత జేబు నుంచి చెల్లిస్తున్నారా? లేక... సొంత శాఖ ద్వారా చెల్లించాలని ఆదేశించారా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఇది సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్‌ పీఆర్‌) ద్వారా జారీ అయితే... ఆ వివరాలను ప్రకటన చివర్లో పొందుపరుస్తారు. అంటే, మంత్రి సొంతంగా ఇచ్చినట్లే. మరి... జీఎస్టీతో కలిపి రూ.1.36 కోట్లు నిజంగానే మంత్రి చెల్లిస్తారనుకోవాలా? పోనీ... 50 శాతం డిస్కైంట్‌ ఇచ్చినా... రూ.68 లక్షలు ఆయన కడతారా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు!?


సమగ్ర శిక్షా విభాగంపై... 

ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టిన క్లిష్ట సమయంలో ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రి పత్రికకు ప్రకటన ఇవ్వడానికి మించిన దారుణం ఇంకొకటి ఉండదు. అలాకాదని... అది మంత్రి సురేశ్‌ సొంత ప్రకటన అంటే మరిన్ని చిక్కులు వస్తాయి. 


ఈ నేపథ్యంలో... ఈ ప్రకటన ఖర్చును తన పరిధిలోని విభాగాల ద్వారా చెల్లింపునకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అంటే... ఇదీ ప్రజల సొమ్మే. సీఎం పత్రిక ఇచ్చిన ‘అండగా ఉంటాం’ ప్రకటన భారాన్ని ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షా విభాగంపై మోపుతున్నట్లు తెలిసింది. కోటిపైనే విలువైన ప్రకటన ఖర్చును ఏ పద్దులో, ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం.  కరోనా దెబ్బకు వ్యాపార, వాణిజ్య రంగాలే కాదు... మీడియా కూడా ఆర్థిక ఇబ్బందులకు గురవుతోంది. ప్రకటనల ఆదాయం దారుణంగా పడిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో మంత్రులు  వరుసగా ముఖ్యమంత్రి పత్రికకు ప్రకటనలు ఇస్తుండటం విశేషం.


Updated Date - 2020-04-12T07:20:52+05:30 IST